పుట:హరివంశము.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

హరివంశము

     గానేరదు నిన్ను వెడలనడుపవలసినపని యిట్లయ్యు నట్లు నేసితి నేని నేన
     తుచ్ఛుండ నగుదు నీచెట్ట నీయొద్దన యుండె నుండిన నుండుము పోయినం బొమ్ము
     పలుకులపని లేదని పలికి మధురేశ్వరుండు భోజకులాలంకారుం డగునక్రూరు
     నాలోకించి.72

కంసుఁడు శ్రీకృష్ణునిఁ దోడ్తేర నక్రూరుని నియోగించుట

క. చని నీవు గోకులంబున, కనఘా యానందగోపు నాతనివారిన్
     మనయియ్యేఁటికి గలయరి, గొని రం డని తోన తోడుకొని రమ్ము వెసన్.73
వ. అదియునుంగాక యేను మదీయం బగుధనువునకు మహోత్సవంబు సేసెద
     దీనికి ననేకదేశాధీశులగు రాజులు మహనీయు నగు మహీదేవతలును నరుగు
     దెంచుచున్నారు పెక్కుదినంబు లామెత లొనర్ప వలసియుండు వ్రజనివాసు
     లగుగోపాలుర నపరిమితంబు లగుదధిక్షీరఘృతంబులు నరణ్యసంభవంబు లగు
     మధువులుఁ దెచ్చునట్టుగా నాజ్ఞాపింపు మఱియును.74
శా. నామేనల్లురు బాహుసత్త్వవికసన్మాహాత్మ్యవిఖ్యాతు లా
     రాముం గృష్ణునిఁ జూచు వేడుక మనోరంగంబునం దాడెడు
     న్వే మద్వాంఛ యెఱుంగఁ జెప్పి మదికి న్విశ్వాస మొందించి నీ
     వాముష్యాయణు లక్కుమారులను దె మ్మాలోకనప్రీతిగన్.75
తే. ఇద్ద ఱున్నారు వీరె నాయొద్ద మల్లు, లీసుపుట్టించి తలపెట్టి యెల్లజనుల
     కుత్సవంబుగ నే నయ్యదూద్వహుల యు, దగ్రదోర్దర్పపరిణతి యరయువాఁడ.76
ఉ. వారికి నాకు సమ్ముఖ మవశ్యము గావలె నట్లుగాక యీ
     వైరము మాన దింపెసఁగువాక్యము లచ్చట విస్తరింపు మ
     క్రూర కఠోర మెట్లయిన [1]రోషము దోఁపఁగ నీకు మెమ్మెయిన్
     జేరరు బాలురు న్విపినసీమ జనించినవారు గావునన్.77
వ. అక్కుమారులం దోడ్కొని వచ్చితేని నా కత్యంతం బగు నుపకారం బొనర్చిన
     వాఁడ వగుదు వసుదేవుకఱపు లెవ్వియు వినకు మీప్రొద్ద కదలు మనిన నట్ల
     కాక యని యక్రూరుండు.78
క. దనుజదమను దర్శింపఁగఁ, దనుఁ బనుచుట హృద్యమధురతరశీతజలం
     బెనయు తృషాతురు గ్రోలం, బనుచుటగాఁ దలఁచి ప్రమదభరితుం డగుచున్.79
సీ. సజలవలాహకశ్యామసుందరదేహుఁ డాజానులంబిసమగ్రబాహుఁ
     డతులితశ్రీవత్సవితతమంగళవక్షుఁ డమలసరోజపత్రాయతాక్షుఁ
     డబ్జచక్రగదాసమన్వితకరపద్ముఁ డమృతాబ్ధినిత్యవిహారసద్ముఁ
     డాలగ్నకనకదుకూలకటీచక్రుఁ డానమ్రసతతరక్షార్థి శక్రుఁ

  1. గోపసమేతముతోఁ బొసంగఁగా