పుట:హరివంశము.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

హరివంశము

     వృషభరూపంబున నాటోపంబు దీపింపం గోపంబునుం బాపంబునుం దనకు
     మృత్యుదూత లై యెలయించుటకు ననుకూలుం డై యాభీలోత్సాహంబున.41
సీ. కాలకూటమునకుఁ గరచరణా[1]ద్యవయవములు ప్రభవించి యలరె ననఁగఁ
     బ్రళయోద్ధతధ్వాంతపటలంబునకు శరీరిత్వవిస్ఫూర్తి వర్తిల్లె ననఁగ
     రాహుసంత్యక్తఘోంకళేబరమునకుఁ బశుభావపరిణతి పరఁగె ననఁగ
     గలికాలసమ్ముఖకలుషరాశికిఁ జతురంఘ్రితావైదగ్ధి యలరె ననఁగ
తే. నతిభయంకరం బగుకరోరాసితాంగ, మెసఁగ నీలాద్రి వృషభమై యేఁగుదెంచు
     కరణి నుత్తుంగతీవ్రశృంగములతోడఁ, జటులఖురపాతపాటితక్ష్మాకుఁ డగుచు.42
వ. గోష్ఠంబులలోని కుఱికి సుఖశయనంబును నలరుపసులం గలంచి గోగర్భిణులకడు
     పులు సినుగం గొమ్ములఁ గ్రుమ్ముచుఁ బొగరుకోడెలం దొడరి పొరిగొనుచు
     వత్సంబులం గాల్మెట్టున బారిసమరుచు మారిమసంగినమాడ్కిం గర్కశబంధుర
     స్కంధంబును నతిస్థూలవిపులకకుదంబును దీర్ఘతరలాంగూలంబును సమవిశాల
     కటిభాగంబును నిజశకృన్మూత్ర స్నిగ్ధపార్శ్వయుగ్మంబును నుల్లసిల్లం బెల్లురేఁగి.43
ఉ. ఱంకెలు గర్జలై యడర ఱాఁపుఁదనంబున నెందుఁ బర్వుని
     శ్శంకవిలోకవైద్యుతకృశానుశిఖల్ దెసలెల్లఁ గప్పఁగాఁ
     బొంకముతోడ విస్ఫురదపూర్వవలాహకభంగిఁ బొంగి యే
     వంకలఁ జీఁకటు ల్గవియ వచ్చె యదూద్వహుపై రయంబునన్.44
తే. మలసి [2]క్రోడాడి యిరుదెసమ్రాఁకు లోలిఁ, గూలఁద్రోచుచుఁ గాల్ద్రవ్వి [3]ధూళిరేఁచి
     చెలఁగి కొమ్ము లమర్చియుఁ బెలుఁచ బాఱు, తెంచునాఁబోతుటసుర దృష్టించె విభుఁడు.45
చ. వెఱచి నిమీలితాక్షు లయి వెన్క కొదింగెడుపువ్వుఁబోఁడులన్
     వెఱవకుఁ డోడకుం డనుచు వేగమ తజా నెదురై కడంగి యే
     డ్తెఱఁ దలశబ్దమిచ్చినఁ గడింది వృషాధముఁ డగ్గలంపుఁదెం
     పుఱవుగఁ దాఁకెఁ గృష్ణుఁ డతఁ డొడ్డినకొమ్ములు వట్టె బెట్టుగన్.46
క. పట్టినఁ గదలఁగ నేరక, యిట్టట్టును బలిమి చెడఁగ నెగయుచు లావై
     మెట్టి నిలిచె హరియును నా, కట్టుపకాసికిని బలముఁ గడకయుఁ జూపెన్.47
మ. వృషభస్కంధుఁడు వారిజాక్షుఁడు మహావిస్తీర్ణవక్షుండు దు
     ర్విషహుం డాతఁడు గోవృషాసురుని నుద్విగ్నాత్ముగా నమ్మెయిన్
     [4]రుషతోఁ బ్రౌఢభుజాబలం బెసఁగ సంరోధించె వేఱొక్కగో
     వృషభేంద్రుండును బోలె గర్జితకళావిస్ఫారుఁ డై యుండఁగన్.48
క. హరి చేతి కగ్గమై చె, చ్చెర నప్పుడ కూల కెంతసే పోర్చెఁ గరం
     బరు దితనిలావుతెఱఁ గని, యరిష్టుఁ గొనియాడి రంబరాంతరచారుల్.49

  1. ననాద్యవయవౌఘంబులు దనరె ననఁగఁ
  2. కోడాడి
  3. కొప్పరేఁచి; కొప్పరించి.
  4. రుషభప్రౌఢభుజద్వయంబునను