పూర్వభాగము - ఆ. 8.
189
కోదితజంతువు లుల్లము, లేది యొడలు మఱచి సొగసె నేంతయు భ్రాంతీన్.8
క. గోపాలురు తద్వేణుర, వాపూరములోన మునిఁగి యానందరస
శ్రీపరిణతి నాత్మీయ, వ్యాపారము లెల్ల వదలి రవిచేష్టితులై.9
ఉ. అత్తఱిఁ బల్లెలోనఁ గలయంగన లెల్ల సముత్సుకంబు లై
చిత్తము లెత్తి తేర యదుసింహునిపాలికి నేఁగు దెంచి య
య్యుత్తమసౌకుమార్యనిధియుజ్జ్వలలీలలు మెచ్చి రాగముల్
కుత్తుకబంటియై యెసఁగఁ గ్రోలిరి చూడ్కులఁ దన్ముఖేందువున్.10
క. తగిలినచూడ్కులు మగుడన్, దిగువ వెరవు లేక మదనుత్రిప్పులఁ బడున
మ్మగువలతగు లాత్మీయం, బగుకోర్కికిఁ దగిన నాతఁ డామోదమునన్.11
క. అనురూపాలోకనముల, ననురూపాలాపములను ననురూపవిచే
ష్టనములఁ దనమనసు తెఱం, గును వారికిఁ దెలియఁజేసి కుతుకముఁ బెనిచెన్.12
వ. ఇట్లు వశీకరించి యందఱం గళిందకన్యాతీరకాంతారంబుల కెలయించిన.13
తే. తల్లిదండ్రులు మాన్ప భర్తలు మగుడ్పఁ, జెలులు వల దనఁ జుట్టలు సిగ్గుపఱుప
వ్రేత లొకటియు నెఱుఁగక వెన్నువెనుకఁ, దగిలిపోయిరి తమకంబు తవులుకొనఁగ.14
సీ. [1]ఎలదేఁటిపదువులయులివుల నొప్పారు చారుపుష్పితలతాగారములను
హంసరథాంగావతంసంబు లగుతరంగలఁ గ్రాలుకొలఁకుల చలువయెడల
సెలయేఱు[2]గడలెడచినుకులనునుగాలిఁ దను పెక్కుశైలనితంబములను
నభినవమరకతశ్యామంబులై వేడ్కఁ బ్రభవించుమృదులంపుఁబచ్చికలను
తే. బరమపురుషుఁ డయ్యింతులఁ బ్రకటరాగ, కుశలపేశలలీలలఁ గొఱలికొఱలి
నాఁడునాఁటికి [3]రతుల విన్ననువుపఱచి, తానుఁ జొక్కెఁ దద్భావవైదగ్ధివలన.15
క. హరిచేష్టితములు గ్రమమున, మరిగి నిజముగాఁ దమతమమగలఁ దొరఁగి యా
హరియంద భర్తృబుద్ధిం, బరిణతలై రావ్రజంబుబాలిక లెల్లన్.16
తే. పరఁగి పుయిలోట లుడుగుట బగలురేయి, బల్లెయందును నడవిలోపల నిజేచ్ఛఁ
దిరిగినట్టులు కృష్ణుతోఁ దిరుగఁదొడఁగి, రంగనలు మదభరవిమూఢాత్మ లగుచు.17
వ. ఇవ్విధంబున నత్యంతాసక్తి భజియించి.18
మ. లలితాలోకములన్ మనోజ్ఞమధురాలాపంబులన్ విస్ఫుర
త్కలహాసంబుల బంధురస్తనభరోత్తానాంగ[4]సంగంబులన్
విలసద్వక్త్రసరోరుహార్పణములన్ స్నిగ్ధోరుసంవేష్టనం
బులఁ బూజించిరి గోపభామలు జగత్పూజార్హు దాశార్హునిన్.19
తే. కలవరించియుఁ గృష్ణాఖ్య తెలివి నున్న, యపుడుఁ గృష్ణాఖ్య యేమఱినట్టివేళ
యందుఁ గృష్ణాఖ్య దక్క నయ్యంగనలకు, రాదు వేఱొకవాక్యంబు రసనతుదకు.20
క. హరిచరితంబులు రసని, ర్భరములుగా జతలుగట్టి పాడుదు రాతం
డరుదుగఁ బాడఁగ నాడుదు, రురుతరకరతాళసంభృతోన్మదగతులన్.21