పుట:హరివంశము.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము ఆ. 7

183


తే.

భవదనుధ్యానపూజనప్రణతివిధులఁ, దగిలియుండువాఁ డొక్కండ ధన్యతముఁడు
వివిధదివ్యావతారప్రవీణభువన, భరధురీణ యాశ్రితమిత్ర పద్మనేత్ర.

198


శా.

గోపాలత్వవిరూపుఁ డైనకతనం గ్రొవ్వగ్గలంబై మదిన్
రూపింపం జొర కేను నిన్ను నిటు సంరోధించి బాధించితిన్
నీపాలం బొలుపారు గోధనముల న్నిక్కంబు దుర్మత్సర
వ్యాపత్తిం బ్రభవించి రోషమది యిట్లై నొంచె నీచిత్తమున్.

199


క.

నీ వఖిలనియామకుఁడవు, దేవా నిన్ను నియమించుదేవర యెవ్వాఁ
డీవిభవ మిచ్చినాఁడవు, గావే నా కింత యేను గాననె మొదలన్.

200


తే.

ఏలయో పుట్టె నా దెస నిట్టికొఱత, దీని సైరింపఁ దగు నీకు దివిజవంద్య
దాసులందు లెక్కింపంగఁ దప్పు లెన్ని, లేవు ప్రభులకు సైరింప లెస్సగాక.

201


మ.

విలయైకార్ణవకారు లైనఘనముల్ వేవేలు వాతూలసం
కులవృష్టిం బ్రసరింప నేను వెనుకన్ ఘోరాకృతి న్నిల్వఁగా
బలిమిన్ దైవతదానవాదులకు మాన్పన్ రానిగోసంప్లవం
బలఘుస్థైర్యుఁడ వై జయించుటకు నే నాత్మం బ్రమోదించితిన్.

202


తే.

కేలికందుక మెత్తినలీలఁ గొండ, యెత్తి గోవులయడరు నీ [1]వి ట్లుడుపుట
వలన మందరధర నీదువైష్ణవంపుఁ, దేజ మఖలలోకములకుఁ దేటపడియె.

203


మ.

త్రిదశప్రీతి యొనర్పఁ గోరి ధరణిం దేజోంశము ల్లీలమై
నుదయం బొందఁగఁజేసి నీవు క్రియ కుద్యోగించు టెల్లన్ శుభ
ప్రదమై పూర్ణతఁ బొందినట్టిదయకా భావించితిం జూవె నేఁ
డు దయావర్ధన యిట్టివిక్రమకళాటోపంబు రూపించుటన్.

204


ఉ.

నీ వొకరుండవున్ భువననిర్వహణంబునకున్ ధురంధరుం
డై వెలుఁగొందువాఁడవు సురావళిలో మఱి యోగ్యు నీదృశున్
శ్రీవర చెప్పుమా కలఁడ సృష్టికిఁ గర్త పయోజగర్భుఁ డా
దేవుఁడు నిన్ను నెన్ని గణుతింపఁగఁ బాత్రమె నీకు నుద్దిగన్.

205


తే.

అంబురాశి నదంబుల కచలములకు, నాహిమాద్రి పక్షులకుఁ గశ్యపసుతుండు
మేటియై యొప్పుక్రియ సురకోటికెల్లఁ, బ్రభుఁడ వీవొక్కరుఁడ కావె పద్మనాభ.

206


సీ.

జలములపై భూమి యిలమీఁద మనుజులు మనుజులపై మేఘమండలంబు
మేఘమండలముపై మిహిరుండు దేవలోకంబున నొప్పు నాకంబు నాక
మేలుటకై దివిజేంద్రత్వ మిచ్చి న న్నీవు ప్రతిష్ఠించి తీశ్వరుఁడవు
నాకలోకముమీఁద నలినజులోక మాలోకంబుమీఁద గోలోక మమరు


తే.

నట్టిగోలోక మేలువారైనగోవు, లనఘ గోవర్ధనాద్రీంద్ర మశ్రమమున
నెత్తి యాత్త్మీయసంతతి నీవు గాచు, డాత్మఁగని యెంతయునుమోద మతిశయిల్ల.

207
  1. విట్టుడుపులు