పుట:హరివంశము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము . ఆ. 7

177


తే.

ఆరగించి పానీయంబు లర్థిఁ గ్రోలి, యేను మెచ్చితి మీపూజ కెంతయేనిఁ
దృప్తిఁ బొందితి ననియె నద్దేవపూజ్యుఁ, డప్పలుకు విని యద్భుతం బతిశయిల్ల.

148


వ.

గోపాలు రెల్లరును గృతాంజలు లై దేవా యేము నీదాసులము నీయాజ్ఞయం
దున్నవార మింక నెయ్యది యానతిచ్చి పనిచెదవు పనుపుము బ్రతికెద మనినం
బర్వతాత్మకుం డయినయాసర్వేశ్వరుండు.

149


సీ.

ఇది యాదిగా మీకు నెల్లకాలంబును నారాధనీయుఁడ నద్రిమూర్తి
యగునన్ను వేల్పుగా నర్చించి కామ్యంబు లెల్లఁ గాంతురు గోవు లెచట నున్న
నభివృద్ధి బొంది నిత్యామృతస్యందినులై మిమ్ముఁ బోషించు నాదరమున
నేనును మీలోన నిచ్ఛాశరీరినై యింకను విహరింతు నింత యెఱిఁగి


తే.

యస్మదాశ్రితులై యుండుఁ డనినఁ గొండ
మీఁదికృష్ణుని మేదినిమీఁద నున్న
కృష్ణు నొక్కటఁ జూచుచుఁ గేలు మొగిచి
మ్రొక్కుచును బొంగి గోపాలముఖ్యు లపుడు.

150


వ.

వివిధవాక్యంబుల నగ్గించి రగ్గిరిశృంగస్థితం బగురూపం బనంతరంబ యంతర్ధా
నంబు నొందె నంత నమ్మహాపురుషుపనుపునం బశుపాలు రందఱుం బసులకొమ్ము
లర్చించియుఁ జిఱుగజ్జెలపేరు లఱుతం గట్టియు వనలతావలయంబులు తలలం
జుట్టియుఁ బలుదెఱుంగుల నలంకరించి మార్పుచుఁ గొండచుట్టు నొక్కవెల్లిగా
వెలిచి యచ్చటచ్చట నివాళించి బడసివైచి, మ్రొక్కి యొక్కటఁ ద్రుళ్లుచు
నుల్లాసంబు నొంది.

151


మత్తకోకిల.

పాయసంబులరొంపులున్ బహుభంగి బూరెలతిట్టలున్
నేయుఁ బాలును దేనియల్ గడు నిండిపాఱెడు నేఱులున్
వేయివేలు దలిర్ప నొప్పెడువిప్రభోజనముల్ యథా
న్యాయదక్షిణ లుల్లసిల్ల నొనర్చి రెంతయు ధన్యతన్.

152


వ.

సమస్తదీనానాథసముదయంబులం దనియం జేసి తామునుం దమతమవర్గంబుల
తోడం గూడ యజ్ఞశేషాన్నం బమృతంబుగా నుపయోగించి పండువు నిండించి
క్రమ్మఱి.

153


క.

హరిఁ బరమేశ్వరు నాశ్రిత, శరణ్యు సకలార్థకరణచతురకృపాసం
భరితాత్మకు మున్నిడికొని, యిరవుగ వ్రేపల్లె కరిగి రెంతయుఁ బ్రీతిన్.

154


వ.

అంత నక్కడఁ ద్రిదివంబునందు.

155


క.

తన పూజ ద్రోపువడుటకు, మనమునఁ గోపమును సిగ్గు మల్లడిగొనఁగా
ననిమిషపతి సంవర్తా, ద్యనుపమమేఘములఁ బిలిచి యాగ్రహ మెసఁగన్.

156