పుట:హరివంశము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

హరివంశము


మూర్తి నఖిలాండకోటియు మోచియుండు, దధికసత్త్వుండ వీవు విశ్వాత్మకుఁడవు.

101


క.

ఏ ననఁగా నీ వనఁగా, భూనుత భేదంబు లేదు పుట్టితి మిటు లో
కానుగ్రహార్థమై మన, [1]మానుషభావ మిది యనుపమానం బెందున్.

102


వ.

కావున నీవిద్దురాత్ముసంరంభంబు సరకుసేయక నీభుజబలంబు మెఱయు మని
తెలిపినం దెలిసి బలదేవుండు.

103

బలరామదేవుండు ప్రలంబుం డనురాక్షసుం బరిమార్చుట

శా.

శైలోత్తుంగశరీరుఁ డైన రిపుమస్తం బుగ్రదంభోళికిన్
మేలై పేర్చుకఠోరముష్టినిహతి న్నిర్భిన్నముం జేయఁగా
నోలిం బెల్లుగ సర్వరంధ్రముల [2]వాతోద్యజ్ఝరాభంబులై
కీలాలంబులు పర్వఁ గూలె నధికక్లిష్టాత్ముఁడై వాఁ డిలన్.

104


క.

చఱినుండి తొలఁగ నుఱికెడు, [3]నెఱసింగపుఁగొదమవోలె నిబ్బరముగఁ గ్రే
ళ్ళురికెం దొలఁగం బగతుని, యఱకటనుండి భువిమీఁది కబ్బలియుండున్.

105


వ.

ఇవ్విధంబునం బ్రలంబహననధౌరేయుం డగురౌహిణేయు[4]విజయం బభినందించి
బృందారకులు బృందారకమార్గంబున నుండి.

106


క.

బలమున నీ దేవుం డిటు, ప్రలంబు వధియించెఁగాన బలదేవుఁ డనన్
వెలయుఁ ద్రిలోకంబుల నని, పలికిరి గోపకులు వినఁగఁ బ్రవ్య క్తముగాన్.

107


చ.

అరిఁ బరిమార్చి సమ్మదభరాతిశయత్వరితాంఘ్రిపాతని
ర్భరగతి నేఁగుదెంచి పృథుబాహుయుగంబునఁ గూర్మితమ్ము నా
సరసిజనేత్రు సుందరవిశాలభుజాంతరుఁ గౌఁగిలించె భా
సురయశుఁ డాప్రలంబవినిషూదనుఁ డాదరబంధురోద్ధతిన్.

108


వ.

తక్కిన గోపకుమారులు నతని ధీరత్వంబును వీరగుణంబును గారవించి కొనియాడి
రయ్యందఱు నందునందును బశుపాలనఖేలనకౌతూహలంబునం బ్రీతు లగుచు
న ట్లున్నంత.

109


చ.

వరుసనిదాఘకాలము ప్రవర్తితమై చనఁగాఁ బయోధర
స్ఫురితవిభూతిమాసయుగశోభితమై భువనప్రమోదని
ర్భరత యొనర్పఁ బిమ్మట శరన్నవసంపద యేఁగుదెంచి ను
ర్వరకు సమగ్రసస్యవిభవంబులఁ గూర్చుచు నర్చనీయయై.

110


మ.

మును వర్షోదకధారలన్ ముదముతో మూర్థాభిషేకంబు గై
కొని శుభ్రాభ్రకిరీటశోభి యయి సంక్షుభ్యన్మరాళావళుల్
ఘనవాలవ్యజనంబులై మెఱయఁగాఁ గాంతేందుబింబాతప
త్రనిరూఢిన్ శరదంబరం బమరె నుద్యద్రాజచిహ్నంబులన్.

111
  1. మానుషభావంబు లిందు మమతం జెందెన్
  2. ధాతూద్యజ్ఞలాభంబులై (పూ. ము.)
  3. నెఱసింగంపుఁగొదమ నిబ్బరమునఁ గ్రే
  4. విభవం