పుట:హరివంశము.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

హరివంశము


తే.

ఘనరసోపయోగంబునఁ గ్రమ్మఱంగఁ
బడసె బ్రాయంబుఁ దగదె యిబ్భంగి యనఁగ
హరితతృణలతారుణకోమలాంగి యగుచుఁ
[1]బృథ్వి యెంతయుఁ గ్రొత్తయొప్పిదము నొందె.

111


శా.

ధారాపూరకఠోరవృష్టిఁ గమలధ్వంసంబు పాటిల్లినం
జేరం జోటొక టెందుఁ గానక భ్రమం [2]జెయ్వేదుభృంగావళిన్
గారా మారఁగ నుద్ధరించెఁ బొగడంగా నొప్పదే నాఁగ నొ
ప్పారెం బ్రస్ఫుటకందళీకుటజనీపామోదికాంతారముల్.

112


క.

ధరణీరజ మడచియు జల, ధరకాలము దెసలు [3]గనతలము దలముగా
[4]సరజంబులు గావించెను, బరిణత [5]కేతకవనోత్థపవనోద్ధతులన్.

113


క.

రేయును బవలును మెఱయుచు, మ్రోయుఘనావళులకలిమి ముద్దియలు దముం
బాయక యుండఁగఁ బరిరం, భాయతభోగరుచు లమరె నాత్మేశులకున్.

114


క.

కుటజకుసుమవాసిత లై, యటవులు నవమాలతీలతాంతపరిమలో
త్కట లై నగరీవనికలు, పటుతాప మొనర్చెఁ బాంథపఙ్క్తుల కెదలన్ .

115


శా.

చండాపాతములం దటద్రుమము [6]లుత్సారించి శుండాలికా
గండూషారవరమ్యతోయ లగుచున్ గాండాంతరావర్తముల్
[7]డిండీరోత్కరవీచులం బెనుప నుద్రేకించెఁ గూలంకషల్
మండూకీపరిగీయమానవిలసన్మాహాత్మ్యలై యెల్లెడన్.

116


వ.

ఇట్టి వర్షాగమంబునఁ గృష్ణుండు బలభద్రసహితుం డై గోపాలనకేళీవినోదంబులం
దగిలి.

117


ఉ.

క్రాలెడుపచ్చఁబట్టు నునుఁగచ్చులు క్రొమ్మెఱుఁగై చలింప ను
న్మీలితబర్హదామము సమిద్ధమహేంద్రశరాసనంబుగా
మేలగు వేణువాద్యవరమిశ్రితగీతము గర్జచందమై
నేలకు డిగ్గెనొక్కొ దివినీలఘనం బననొప్పెఁ గానలన్.

118


క.

వనకుసుమవిభూషిత మగు, వనజాక్షునితనువు మెఱసె వనవిటపివిమ
ర్దనలగ్నలతాంతం బగు, వనవారణవిభునుదగ్రవపువును బోలెన్.

119


సీ.

ఆసమయంబున నట విదేహక్షితిమండలంబునయందు మహిళచరితుఁ
డమితగోధనము ధనాభివృద్ధియుఁ గలవాడు గుంభకుఁ డనువల్లవుండు
ఘనుఁడు యశోదకు ననుజుండు ధార్మికుఁ డర్థుల కనిశంబు నాజ్యదుగ్ధ
దధితక్రదానంబు తాత్పర్యమునఁ జేయు నతనిభామిని ధర్మదాహ్వయమునఁ


తే.

బరఁగు నన్వర్థనామయై భవ్యశీలు, రట్టిదంపతులకుఁ బుత్రుఁ డధికుఁ డొకఁడు
గలిగె శ్రీధాముఁడన నొకకన్య నీళ, యనఁగ జనియించి గారాము దనరఁ బెరిఁగె.

120
  1. బృథివి
  2. జెయ్వేటు
  3. గగనతలవలయముగా (పూ. ము.)
  4. నిరతంబును
  5. కేతకిరజోత్థ
  6. లుచ్చాటించి (పూ. ము.)
  7. డిండీరాంతర . . . నుడ్డీనించె (పూ. ము.)