పుట:హరివంశము.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

హరివంశము


కున్నవా రొక్కకారణంబు గలిగించెద నట్లు సూడు మని పలికి యొక్కింతసే
పూరకున్న యెడ.

6


మ.

జలజాతేక్షణు సర్వగాత్రముల సంజాతంబులై పెల్లుగాఁ
బులులో సింగములో పిశాచములొ నాఁ బొంగారి యొక్కుమ్మడిన్
బలవత్తీవ్రవృకంబు లెల్లపొలమున్ వ్యాపించె గోపాలకా
కులగోవత్సభయంకరంబు లగుచుం గోపప్రదీప్తాకృతిన్.

7


వ.

ఇట్లు పుట్టిన యాక్రూరసత్వంబు లది మొదలుగాఁ దొడంగి.

8


క.

పదియును బదియేనును నిరు, వదియును ముప్పదియు దాఁటువడి నిత్యంబున్
గొదగొని తిరిగి వధింపఁగఁ, గదలఁగరాదయ్యె గొల్లగమి [1]కెచ్చోటన్.

9


సీ.

నీళ్లకు నేటిలోనికి డిగ్గఁగాఁ బెద్దతఱపిపెయ్యలఁ బట్టి [2]నుఱిపె నేఁడు
వడిఁగూడి పాలకావళ్లు దేరఁగ మందవాండ్రను బొరిగొని వ్రచ్చె నేఁడు
వేకువకడఁ బోయి పోఁకు మేయఁగఁ బాడియావులఁ బొదివి చెండాడె నేఁడు
పులికైనఁ జెలఁగి మార్మలయఁజాలెడు మేటియాఁబోతుఁగిట్టి యుక్కడఁచె నేఁడు


తే.

గొల్ల లేముఱినప్పుడు గొఱియకొదమ, [3]నెత్తుకొనిపోవు తోఁడేళ్ల కిట్టిసేఁత
లెందు వింటిమె యని జను లెల్లఁ దల్ల, డిల్ల వ్రేపల్లె తద్దయు డిల్లపడియె.

10


వ.

మఱియును రాత్రిసమయంబున బెబ్బులుల హుంకారంబులును సింహగర్జితంబులు
నుగ్రం బై వీతెంచె మహాదేహంబు లగువరాహంబులు సొచ్చి ఘోణంబున నెల్ల
చోట్లుం గ్రోడాడఁ దొడంగె నంత గోపప్రవరు లంకఱుం గూడఁబడి నందగోప
సమేతంబు దమలోన మంతనంబుండి.

11


క.

ముందటియుత్పాతములకు, డెందంబుల నొచ్చి యిప్పటికి బాయఁగలే
కిం దుండఁగ మన కిమ్మా, డ్కిం [4]దనుకఁగ రానికడిది డెప్పరమయ్యెన్.

12


వ.

బృందావనంబు కడు లెస్సచో టని వ్రేపల్లెలోనివా రెల్ల నెల్లప్పుడుం జెప్పికొను
చుండుదు రందును దుర్గమంబు లగు నెలవుల రక్కసులు గల రనియును విందు
మేమి సేయుద మెక్కడికిం బోద మీ ప్రొద్ద కదలవలయు నింక నిక్కడ నొక్క
దివసం బొక ముహూర్తం బొక్క గడియ యున్నను నంతకంతకు నెంతంత నేగు
లగు నని విచారించుసమయంబున నారదుం డేతెంచి నందగోపు నేకాంతంబునకుం
దోడ్కొనిపోయి.

13

నారదుఁడు నందగోపుని బృందావనంబునకుఁ బోఁబనుచుట

క.

అతనియొనరించువినయం, బతులకరుణ నాదరించి యానందరస
[5]ప్లుతికారిణి యగువాక్య, శ్రుతి నాతని కింపొనర్చుచును నిట్లనియెన్.

14


ఉ.

ఈవనభూమి యీవసతి నెంతయుఁ దప్పి వసింపఁ బట్టు బృం
దావన మొక్కఁ డక్కడయు దైత్యమయం బట యేమి సేయుదున్

  1. కచ్చోటన్
  2. నుఱికె
  3. నెత్తెఁ గాక తోడేలవుడిట్టిచేత
  4. దలుకఁగ
  5. సృతి, స్రుత.