పుట:హరివంశము.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

132

హరివంశము


తే.

 ఓలిఁ గట్టిన యుట్లకు నుఱికి పెద్ద, బానలం దున్నవెన్నలు బావుకొనుచు
[1]నుట్టులను వ్రచ్చి బాన[2]ల నురలఁద్రోచి, [3]సురుగుఁజెలికాండ్ర కెల్లనుఁ జూఱవిడిచి.

208


సీ.

[4]కడవలపాలు సగంబుగాఁ ద్రావుచు నీళ్లను దెచ్చి యన్నింట నినుచుఁ
బెరువంతయును [5]గ్రోలి పిదప బానలయందు సంపూర్ణముగఁ బాచిచల్ల లునుచు
నేతులు గొనిపోయి నెఱయ నిప్పులఁ బోసి పెనుమంట లొండొండఁ దనరఁజేయుఁ
బెరువులోఁ బాలును బెరువు వెన్నను వెన్న [6]జల్లను జల్ల నాజ్యమును గలపుఁ


తే.

[7]దలుగులూడ్చి పెయ్యలనెల్లఁ దల్లిచన్ను, గుడువ విడుచుఁ గొన్నిటి నలుగడలఁ దోలి
యుఱక దామెనకొయ్యలు పెఱికి పాఱ, వైచుఁ గావళ్ల యుట్లను వ్రచ్చి తెంచు.

209


ఉ.

ఆడఁగఁ దెచ్చి బాలకుల నందఱ నయ్యయియాట నొక్కమై
నోడఁగఁ జేసి వీఁపడిఁచి యొక్కని నొక్కని నెక్కుఁ బల్వురం
గూడఁగఁ గూఁకటు ల్ముడిచి కోయని యార్చుచు గాసిసేయు సం
క్రీడల నెంతలావరియు గీడ్పడి చిక్కఁగఁ గృష్ణుఁ డుద్ధతిన్.

210

గోపికలు యశోదతోడ శ్రీకృష్ణుని దుష్టచేష్టితంబుల చెప్పికొనుట

వ.

ఈ భంగి వ్రేపల్లెయెల్ల నేలకుం గోలకుం దెచ్చుచున్న యక్కుమారు వారింప
నలవి గాక గోపాలురెల్ల నుల్లంబుల వెక్కసపడి చూచుచుండ గోపికలు [8]గూడఁ
బడి యశోదపాలికిం జనుదెంచి.

211


తే.

గోతి [9]నీవ కాగారాబు[10]కొడుకుఁ గంటి, వేము పడుపాటు లరయవ యెట్టిబలియు
రైనఁ దగవు పాటింపరే యకట కృష్ణుఁ, జిన్నవాఁ డని సమయ మిన్నకునికి.

212


క.

కుటిలవు నీవు తనూభవు, నిటు సేయఁగ విడిచి తాత్మ నించుకయును న
క్కటికంబు లేదు వినుమా, యటు నీ చెవులార నిట్టు లాత్మజకృతముల్.

213


వ.

అనునెడ నొక్కవ్రేత యన్నాతిముందరికి వచ్చి.

214


క.

నాయింటం బదిగడవల, [11]నేయి పెరుఁగుఁ బాలుఁ ద్రావె నేఁ డిదె కృష్ణుం
డోయమ్మ కడవ లన్నియుఁ, గే యని బోరగిలఁ ద్రోచి కేరుచు వచ్చున్.

215


తే.

పేదవార మింతటితోన పీడవడితి, మిట్టులైనను మా కింక నేది బ్రదుకు
మున్ను వోయిన నేగికి నెన్నఁ గొలఁది, లేదు నాఁగ వేఱొక గొల్లలేమ రేఁగి.

216


చ.

అసురయొ కాక నీతనయుఁ డంగన యేఁబదిబానలందుఁ బొ
ల్పెపఁగెడు వెన్న యుట్లపయి [12]నేఁ బదిలంబుగ డించి యుండ వె
క్కసముగ మ్రింగె బానలును గ్రమ్మనఁ గూలఁగఁ ద్రోచె నుట్టులు
న్వెస నుఱుమాడె నేమిగతి వ్రేఁగుదు నెక్కడఁ జొత్తుఁ జెప్పుమా.

217


వ.

అని పలుక నలుకతోడ గోపిక యోరు నర్తించువిధంబునఁ జేతులు సాచుచుం
గృష్ణజననిం గదిసి యిట్లనియె.

218
 1. నుట్లనులిపుచ్చి
 2. లు నొరఁగ
 3. జోడు
 4. సగము గలయం ద్రావి
 5. ద్రావి
 6. చల్లను జల్ల యాజ్యమునఁ గలపు
 7. దలువు
 8. గూడఁబాఱి
 9. నీవొక
 10. కొడుప
 11. నెయును బెరువులును
 12. నేను దిరంబుగ నుంచి