పుట:హరివంశము.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

హరివంశము


వోయి [1]లజ్జించి యున్నవాఁడు గావున సాహసోత్సాహంబు దక్కి (శకటాసురుం
డాదిగా) రక్కసులఁ బెక్కండ్ర నక్కుమారుదిక్కునఁ గీడు గావింపఁ బనిచె నట్లు
పనుపువడినవారిలో శకటుం డనువాడు నందగోపుని ప్రియశకటంబు నావే
శించి తనమాయ నెదిరికి భావింపరాక యుండె నంత నొక్కనాఁడు.

168


ఉ.

పాపని నిద్రవుచ్చి తగుపాన్పునఁ దచ్ఛకటంబు క్రిందఁ దాఁ
దీపెసలార నుంచి సుదతీతిలకంబు యశోద వేడుకన్
గోపసతీసమేతయయి గోఁతి సమీపగయై తనర్చున
య్యాపగ నీళులాడుటకునై చనియెం ద్వరమాణచిత్త యై.

169


క.

ఒక్కింతవడికి నర్భకుఁ, డిక్కడ మేలుకని యొద్ద నెవ్వారును లే
కెక్కు డగుశిశుత్వము మై, నెక్కొనుచాపలము లెల్ల నెఱసి తలిర్పన్.

170


శా.

నోరం జేతులు రెండు గ్రుక్కి కొనుచు న్నోమెల్ల బాష్పాంజన
స్మేరంబై తిలకింప నేడ్చుచుఁ [2]బొరిన్ మీఁజేతులం గన్ను [3]లిం
పారం దోముచు లేవఁజూచి పిఱుఁ దొయ్యన్మీఁది కల్లార్చుచున్
శ్రీరమ్యాంఘ్రియుగంబు [4]గింజుకొనుచుం జెల్వంబు రెట్టింపఁగాన్.

171


క.

తనమాయాజాలంబుల, మునిఁగి సకలలోకములును ముగ్ధంబులుగాఁ
దనరెడు ప్రౌఢుఁడు లోకము, తనమౌగ్ధ్యంబునకుఁ బ్రముదితం బగుచుండన్.

172

శ్రీకృష్ణుఁడు శకటాసురుని సంహరించుట

వ.

అట్లుండి యచ్చట.

173


సీ.

ఒకదట్టు దోరగల్లొఱగి పైఁబడుదునో తొలఁగి కమ్ములు మ్రోయ నిల చలింపఁ
దొడరి వే పఱతెంచి త్రొక్కుదునో పలుగాఁడి లోనైనయంగముల నొకట
నెడలించి మీఁదట నెసఁగెడుప పెల్లఁ బడఁద్రోచి యడఁతునో పడుచు నేమి
వెరవున వధియింప దొరకొను నా కిది యవసరం బని తనయాత్మఁ దలఁచు


ఆ.

శకటుతలం పెఱింగి చయ్యన నాలోనఁ, జరణ మొకటి లీలఁ జాఁచి తాఁచెఁ
దత్క్షణంబ బండి తలకెడవై పాసి, యవుల సంధు లెడలి యవనిఁ జెదర.

174


వ.

అంత.

175


తే.

వేగ సుస్నాతయై తగ వెలఁది యయ్య, శోద యాగోపికలను నచ్చోన డించి
సరసహార్దతఁ [5]జేఁపెడు చన్ను లదిమి, కొనుచు వత్సంబుఁ దలఁచినగోవు వోలె.

176


వ.

అతిత్వరితగతి నేతెంచి విపర్యస్తం బైనశకటంబు నంతంతం గని హా యనుచుం
బఱతెంచి పుత్రు నెత్తి యుదరంబున నదిమికొని.

177


ఉ.

ని న్నిటు పాఱవైచి తగ [6]నిద్దురవోయెడుఁ బాపఁ డంచు నే
మిన్నక [7]నీళ్లనాట యను మిత్తికి నేటికిఁ బోయితి న్నిజం

  1. లజ్జించుచున్న
  2. బొరిమ్మీ
  3. లేపారం
  4. గుంజ
  5. జేపుడు
  6. నిద్రను జెందెను
  7. యుండి నీళ్లకును