పుట:హరివంశము.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

హరివంశము


మ.

తలయుం జీరయు వీడ సంభ్రమముతో దైవోపఘాతంబునం
గులఁకం గ్రుళ్లుచుఁ బాఱుతెంచి వెస నాకంసుండు తత్సూతికా
నిలయద్వారము నందు నిల్చి శిశువుం దేతెమ్ము తె మ్మంచు నా
కులుఁడై పల్కఁగఁ గృష్ణమాతయును సంక్షోభార్తయై యత్తఱిన్.

124

కంసుండు యశోదకుఁ గూఁతురై పుట్టిన యోగమాయం జంపం బూనుట

క.

[1]అన్నా యలుగకుమీ నా, కన్నది యిదె యాఁడుబిడ్డ గావుము దీనిన్
ని న్నొకటి సేయఁ గలదే, కన్నియ యతిలోకపురుషకారసమగ్రున్.

125


ఆ.

మొదలఁ బెక్కుగర్భములు నీబ్రదుకు గోరి, వరుస [2]నొప్పింపనే మగవారలైన
నుడుగవయ్య యాగ్రహము నాయెడఁ బ్రసాద, దృష్టి పరఁగింపవే జగద్వినుతవిభవ.

126


వ.

అని [3]ప్రార్థించిన నచ్చటివనిత లొక్కపెట్ట హాహాకారంబు లొనర్ప నభ్యంతరంబు
సొచ్చి యచ్చెడుగం డప్పాప నెప్పటిరాతితో నడుచుటకై [4]పూని యెత్తిన మెత్తనఁ
బ్రిదిలి చదలి కెగసి యయ్యుగ్మలి యద్భుతాకార యై యం దుండి.

127


క.

తనచేతిపానపాత్రం, బున [5]నొలికెడు దివ్యమధువు ముదమున నాస్వా
దన మొనరించి మదోద్ధత, నినదంబునఁ బెలుచ నవ్వి నిష్ఠురభంగిన్.

128


వ.

భయవిస్మయ[6]ంబులు మనంబునం బెనంగొనం గనుంగొను భోజపతి నుద్దేశించి.

129


ఉ.

ఓరిదురాత్మ నన్ను నిటు లుగ్రతఁ బట్టి శిలాతలంబుపై
[7]బోరన వ్రేసి చంప నిటఁ బూనిన తప్పున కేను నిన్ను నీ
దారుణశత్రుఁ డాహవవిదారితుఁ జేయఁగ మృత్యుమూర్తి నై
క్రూరతఁ బ్రాణముల్ రుధిరకుల్యయుఁ గ్రోలుదు నొక్కపూఁపునన్.

130


క.

ఇంకేమి త్రుళ్లఁగల విదె, యింకె నహంకారపంక మెల్ల ననుచు ని
శృంకత నద్దేవి సనియె, సంకుల మై తన్ను సిద్ధసంఘము గొలువన్.

131


వ.

ఇక్కడఁ గంసుండును దేవకీదేవికిం గృతాంజలి యై యి ట్లనియె.

132


ఉ.

ఏనిటు ప్రాణరక్షకయి యెంతయుఁ బాపము సేసి గర్భసం
తానవిఘాతి నై నిను నుదంచితశోకపయోధి ముంచితిం
బూనినమత్కృతం బఖిలమున్ వృథ యయ్యె విధాతచెయ్ది యె
వ్వానికి మాన్పఁగా నకట వచ్చునె మానుష[8]తుచ్ఛయత్నతన్.

133


క.

విను చంపఁ జెఱుప మను ను, ఘనతర మగుకాల మొకఁడ కర్త మనుష్యుం
డు నిమిత్తమాత్ర మింతియ, యనయమ్మును గాల[9]పాక మైనక్రియలకున్.

134
  1. అన్నన్న యలుగకుము
  2. నొప్పించ
  3. ప్రార్థింప
  4. పూంచి
  5. నలరెడు, ఁదనరెడు.
  6. విహ్వలుండై
  7. భోరన వ్రేసి చంప నని బూనితి నిన్ను వధించుశత్రు నీ, తోరము గాఁగఁ బట్టి భవదూరితు; చంపు దని పూనిన.
  8. యత్నతుచ్ఛతన్
  9. పక్వ