పుట:హరివంశము.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - పంచమాశ్వాసము

శ్రీధరణీసంభృతగృహ
మేధివ్రత విభ్రమోపమితవిష్ణుకథా
మాధుర్యబహువిధశ్రుతి
సాధితచాతుర్య వేమజనపతివర్యా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పెనట్లు విశ్వంబునకుం బరాయణుం
డగునారాయణుండు దుగ్ధసాగరంబున విముగ్ధయోగనిద్రావశుం డై నివసింపం
గ్రమంబునఁ గృతత్రేతాహ్వయంబు లగుయుగంబులు రెండును [1]గడచనఁ దృతీయ
యుగావసానం బగుకొలది బ్రజాభారపీడిత యై పృథివి యాక్రోశింప
ననుక్రోశవశంబునం బొంది బృందారకులు శతానందన కెఱుంగించి యతని
మున్నిడికొని.

2


తే.

నాగశయనీయశయు మహానందు నాది, దేవు భువనపావను సుధీభావనీయుఁ
బ్రకటమధురవాక్యంబులఁ బ్రస్తుతింప, నల్ల నాలించి మేల్కని యచ్యుతుండు.

3


ఉ.

తెల్లనితమ్మిఱేకులకుఁ దియ్యపునెచ్చెలు లైన కన్నులం
జల్లనిచూపు చూచి యిటు సంగతులై చనుదెంచినారు మీ
రెల్లను లోకముల్ శుభసమేతము లే యసురాధముల్ ప్రవ
ర్తిల్లరుగా సమస్తజగతీపరిపీడ యొనర్పఁ గ్రమ్మఱన్.

4


వ.

అని యానతిచ్చినఁ గమలసంభవుం డవ్విభుని యగ్రభాగంబున ఫాలభాగవిరచి
తాంజలి యై యి ట్లనియె.

5


సీ.

అవధరింపుము ధాత్రియం దెప్పు డెందును రాజు లన్యోన్యవైరములు దక్కి
పాటియు సత్యంబు పాటించి యాఱవుపా లప్పనము గొని ప్రజల మనిచి
యర్థంబు తగగ నుపార్జించి బంధుమిత్రామాత్యభృత్యజనాభివృద్ధి
గావించి సతతయాగంబుల దేవభూదేవపితృప్రీతి యావహించి


తే.

యధికధార్మికు లగుట వర్ణాశ్రమంబు, లాత్మధర్మముల్ దప్పక యాచరింప
నెల్ల వారునుఁ గడు నాయువెక్కి పగయుఁ, దెవులుఁ జావు లేకున్నారు దేవదేవ.

6


ఉ.

ఏనగరంబు చూచిన నరేంద్రులకున్ బహులక్షకోటిసం
ఖ్యానము లయ్యెఁ గుంజరహయాదులు మర్త్యులకెల్లఁ బేర్చు సం

  1. గడచి తృతీయ