పుట:హరివంశము.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

హరివంశము


ర్వాతంకంబుగఁ బ్రేల్పఁగాఁ దొడఁగె దేవానీకమున్ దానవ
వ్రాతంబుల్ సెలఁగెం గలంగి విబుధు ల్వార్ధీశ్వరుం జేరినన్.

102


వ.

[1]దివస్పతి యయ్యాపదకుం బ్రతీకారం బవ్వరుణు [2]నడుగుటయు నతం డిట్లనియె.

103


సీ.

విను మౌర్వుఁ డనుమహాముని తొల్లి బ్రహ్మచర్యవ్రతనిష్ఠుఁడై యధికతపము
కడుదీర్ఘకాలంబు నడపంగ జగముల కెంతయు భయ మైన ఋషులు సురలు
నాతనిపాలికి నరుగుదెంచిరి హిరణ్యకశిపుఁ డాదిగా నసురతతియుఁ
జనుదెంచె నట్లు గూడిన వారలందఱు నమ్మహాతునితోడ ననఘ యిట్లు


తే.

నీవు పిన్నప్రాయంబున నెఱయ బ్రహ్మ, చారివై నిష్ఠ సలుపంగ సకలకులముఁ
జెడదె విచ్ఛిన్నమూలమై సిద్ధమునులు, వినవె పత్నీసమేతులై కనిరి సుతుల.

104


క.

అలజడియె కాక నీకీ, నిలుకడ నొకమేలు గలదె నిజము వినుము మా
పలుకులు సంతతిఁ బడయం, దలకొను మనుటయు నతండు దరహాసముతోన్.

105


వ.

వారల నందజం గలయం గనుంగొని యిట్లనియె.

106


తే.

బ్రహ్మయోనిసంజాతుఁ డై బ్రహ్మవిద్య, నలవరించుచు బ్రహ్మంబు నాత్మఁ జూచు
బ్రాహ్మణుఁడు బ్రహ్మచారియై పరఁగవలదె, బ్రహ్మయైన జాలునె యట్టిభవ్యుఁ గలప.

107


వ.

వేదాధ్యయనయజన[3]ప్రజాసముత్పాదనంబులను మూఁడు తెఱంగులును ఋణ
త్రయమోక్షణోపాయంబు లై గృహస్థునకుం బాల్పడినవి యేము వనస్థుల మై
యున్నారము నిరాహారులు పవనజలాదిభోజనులు [4]నశ్మకుట్టులును దంతో
లూఖలులుం బంచతప్తులు నగుట వానప్రస్థధర్మంబు పరమధర్మంబు మాకు బ్రహ్మ
చర్యంబు మున్నిడుకొని పరమగతిం బ్రాపింపవలసి యుండు.

108


క.

వినుఁడు తపంబును ధర్మం, బును వ్రతములు యోగచర్యములు నిష్ఫలమై
చను బ్రహ్మచర్యనిష్ఠకు, ననుకూలుఁడుగానిఖలున కని రాదిమునుల్.

109


క.

తరుణీసంగమ మెక్కడ, యిర వగుయోగదశ యెక్క డేయూరికి నే
తెరు వజితేంద్రియుఁ డగుదు, శ్చరితుని యోగంబు దంభసంజ్ఞమ కాదే.

110


వ.

పరమేష్ఠి తన బ్రహ్మచర్యంబు పొలివోవక యుండ మానసు లగునాత్మజుల సృజి
యించె మీరు బ్రహ్మచర్యంబు గా దని నిందించితిరి. సాధువు లయ్యు [5]నసాధు
వులుం బోలె నిట్లు పలుకం దగునె నన్ను సంతతి వడయు మనియెదరేని భవద్వ
చనంబు సేసెద [6]నట సూడుం డని పలికి యతండు.

111


క.

తనతపముపేర్మి ననపా, యనిరూఢం బైనకాయ మమరంగ హుతా
శనునందుఁ దొడయొకటి యిడి, గొనకొని మధియించె విశదకుశకాండమునన్.

112
  1. దేవపతి
  2. నడుగ
  3. ప్రజోత్పాదనంబు
  4. అశ్మకుట్టాశులు
  5. నసాధువులపోలె
  6. నట్లు