పుట:హరివంశము.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

83


నింక నయ్యెడు నట్టివియును సహస్రసంఖ్యంబులు వానిం బురాణవిదు లెఱుంగుదు
రేనునుం గొన్ని కీర్తించెద.

13


ఉ.

లోకము [1]సర్వమున్ జలములోన మునింగి హతప్రకాశ మై
యాకుల మైనచో యుగసహస్రసమం బగుకాల మాత్మవి
ద్యాకమనీయసుప్తి నలరారి ప్రబుద్ధత నొంది ఫుల్లనా
భీకమలంబునం గనియెఁ బెంపుగ నచ్యుతుఁ డాచతుర్ముఖున్.

14

వరాహావతారంబు సంక్షేపరూపంబుగాఁ జెప్పుట

వ.

ఇది పౌష్కరం బనునవతారం బాసమయంబున మధుకైటభులను దానవులు
సమరోన్ముఖు లై తోడరిన సమయించి యద్దేవుండు దీప్తం బగు తేజంబున వెలింగె
మఱియుం గల్పాదియం దమ్మహాప్రభావుండు భవ్యశ్రుతిచరణంబును యూప
దంష్ట్రంబును బ్రాయశ్చిత్తనఖంబును జిత్యాముఖంబును వహ్నిజిహ్వంబును
గ్రతుజానుకంబును దక్షిణాహృదయంబును నాజ్య[2]నాసికంబు నుపాకర్మోష్ఠంబును
నహోరాత్రలోచనంబును వేదాంగశ్రవణంబును సాముస్వనంబునుం దర్భరోమం
బును బ్రవర్గ్యావర్తభూషణం నను బ్రహ్మశీర్షంబును హవ్యకవ్యవేగంబును వివిధ
చ్ఛందోమార్గంబును బ్రాగ్వంశకాయంబు నగుయజ్ఞవరాహరూపంబు ధరి
యించి.

15


సీ.

కొవ్వాఁడికోఱలమవ్వంపుమెఱుఁగుల విలయాంధకారంబు [3]వెలుఁగువాఱ
గురగురధ్వనులు [4]నిర్భరముగఁ బర్విన నెలసి బ్రహ్మాండంబు లెదురు మ్రోయ
మునుమించి నిడుమోర ముంచి దూఁటిన మహా[5]జలధిపూరము తల కెడవు గాఁగఁ
దోరంపు గొరిజుల త్రొక్కున నొడలెల్ల [6]నలిగులియై సర్పనాథుఁ డొదుఁగ


తే.

నేడుపాతాళముల [7]క్రిందియిఱుకుగొంది, కరిగి [8]తోయాత్తయైనున్న ధరణిఁ
జూచి మొగము [9]దాపుగ నిచ్చి నిర్ముద్రశక్తి, గరిమ గడలొత్తఁగా నెత్తె [10]గిరివిభుండు.

16


వ.

ఇట్లెత్తి సప్తసాగరసప్తద్వీపసప్తమహీధరవిభాగవిభాసిత యైన యమ్మహీదేవి
మరల నమ్మహాతోయమధ్యంబునఁ బదిలంబుగా నునిచె నిది వరాహావతారంబు
నారసింహం బగు నవతారంబు వినుము.

17


చ.

దితితొలుపట్టి దైత్యకులదేవత దైవతలోకదుస్సహా
ద్భుతభుజుఁ డాహిరణ్యకశిపుస్ఫుటనాముఁ డనామయాకృతిం
గృతయుగవేళఁ జేసె గతకిల్బిషుఁడై తప మూర్జితక్షమా
స్మృతిధృతిశాంతిదాంతిముఖసిద్ధగుణంబుల మేటి వీఁ డనన్.

18
  1. లన్నియున్
  2. నాసంబు
  3. వెలరువాఱ (పూ. ము.)
  4. నిబ్బరముగా
  5. జడపూరమతలము
  6. నలినలియై
  7. క్రిందని
  8. తోోయార్ద్రమై
  9. డాపుగ
  10. కిరిప్రభుండు