పుట:హరివంశము.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3.

77


దఱమును నొక్కఁడై కలసి దవ్వుగఁ బాపుద మెవ్వ రెక్కడే
[1]నొఱగిన వారి నెల్లఁ దగ నోర్తము నిశ్చయ మిట్లు దీనికిన్.

202


వ.

అనిన నతండు నవ్విధంబున కియ్యకొనియె జనార్దనుండు జతుగృహదాహంబునఁ
గుంతీనందనులు మ్రంది రనువార్త విని తాను బరమార్థవేది యయ్యును
దుర్యోధనుబుద్ధికి నిజంబు గావించుటకై వారణావతంబునకుఁ బోవుటయు
రంధ్రాన్వేషి యగుటం జేసి.

203

శతధన్వుఁడు సత్రాజిత్తుం జంపి శ్యమంతకమణి నపహరించుట

తే.

అలఘుచరితు సత్రాజిత్తు నర్ధరాత్రి, సుప్తుఁడై యుండ వధియించి లుప్తధర్ముఁ
డైనశతధన్వుఁ డతనియనర్ఘదివ్య, వినుతమాణిక్యరాజంబు గొనుచుఁ జనియె.

204


సీ.

తండ్రిఁ జంపినఁ గడుఁ దలఁకి యత్యంతవేగము గల గుఱ్ఱాలఁ గట్టినట్టి
తే రెక్కి చెచ్చెర వారణావతమున కరిగి యాతెఱఁగు నారాయణునకు
సర్వంబు నెఱిఁగించె సత్యభామాదేవి వాసుదేవుండు నవ్వామనయన
మనసులో నున్న యుమ్మలికయు మానెడు పంతంబుమాట లొక్కింత కొఱఁత


తే.

పడక యుండంగఁ [2]బలికి యప్పడఁతిఁ గొనుచుఁ
బురికిఁ జనుదెంచి యేకాంతమున హాలాంకు
[3]తోడఁ దలపోసి శతధన్వుఁ దునిమి యతని
చేతిరత్నంబు గొనుపని సేయఁదలఁచె.

205


వ.

ఇట్లయ్యిరువురుం గూడి కీ డొనర్ప నుద్యోగించు తెగువ యెఱింగి శతధన్వుండు
వారితోడి[4]పోరికిఁ బెనుప్రాపై నిలుచునట్లు గృతవర్మ [5]నడుగంబోయిన నతం
డియ్యకొనక బలదేవవాసుదేవులదెస విరోధంబునకుఁ [6]2దానొనర్పమి దెలియం
బలికె నక్రూరుం గలపికొనువాఁడైన నతండు.

206


మ.

[7]అసురీహారమృణాళహంసము [8]మహేంద్రాంతఃపురీకర్ణప
త్రసమున్మీలనమూలశిల్పి [9]గుమతథ్వాంతార్కబింబంబు దు
ష్ప్రసహం బెవ్వనిచక్ర మట్టిహరికిం బ్రత్యర్థియై నిల్వఁగా
వసమే యెంతటివానికిన్ వెఱుతు నివ్వైరస్యముం బూనఁగన్.

207


వ.

ఏ నతని శరణాభిలాషకుండ దోషాచరణంబునకు నెట్లు గణంగుదు [10]వెడంగనయి
మున్ను మీతలంపునం గలసితి నవి యన్నియు నప్రయోజనం[11]బు లనిన శత
ధన్వుం డట్లేని నాకు నిక్కడ [12]నన్యుంచు రక్షకుండు లేఁడు తొలఁగిపోయెద నీ
వీయలభ్యరత్నంబు డాఁపవలయుఁ బ్రాణంబుపయి నచ్చునంతటి పోరామి
యందును నెవ్వరికి నెఱింగింపకుండునది యని యొడంబఱచి యతనిచేతి కిచ్చి
యా ప్రొద్ద పురంబు వెలువడి పూర్వోత్తరదిశాభిముఖుం డై.

208
  1. నొరసిన
  2. నాడి
  3. తోఁడ
  4. పోరునకు
  5. నొడఁబఱుప
  6. నొడఁబఱుప
  7. అసురవ్రాత
  8. సురేం
  9. గుముద, కుమతి
  10. వెణంగురునయి
  11. బనిన
  12. నుండుమను దక్షుండు