పుట:హరివంశము.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

హరివంశము


వ.

మాద్రికి యుథాజిత్తుండు దేవమీఢుండును [1]ననమిత్రుండును ననువారు పుట్టి
రందు దేవమీఢునకు శూరుండు పుట్టె.

155


క.

శూరోత్తముఁ డగుశూరుఁడు, మారిష యనుపత్నియందు మహనీయగుణో
దారు వసుదేవు దేవా, కారుఁ గనియె నిర్వికారగౌరవరమ్యున్.

156


ఉ.

ధీనిధి యుత్తముండు వసుదేవుఁడు పుట్టినయప్పు డంబరం
బానకదుందుభిధ్వనితమై కురిసెం గుసుమప్రవర్షముం
దానన చేసి యాసుగుణధాముఁడు మానవ[2]నాథభూషణుం
డానకదుందుభిస్ఫుటసమాఖ్య వహించె జగత్ప్రసిధ్ధిగన్.

157


తే.

పిదప వసుదేవుఁ డనుపేరఁ జేర్చు కాంతి, నమృతకరుఁ బోలి యొప్పుట నతిశయిల్లె
నతనిజననంబునకుఁ బ్రీతి నందె నందు, జంగమస్థావరాత్మకసకలజగము.

158


వ.

ఆవసుదేవునకు ననుజులయి దేవభాణుండు దేవశ్రవుండు నరాదృష్టి యనువారు
మొదలుగాఁ దొమ్మండ్రు బహుసంతతులం బడసిరి తత్సంతానంబులలోన దేవ
భాగునకుం బుత్రుం డగునుద్ధవాచార్యుఁడు బుద్ధితత్త్వంబున నింద్రాచార్యు
తోడం బురుడించె మఱియుం గౌశికుండు సుమిత్రుండు మొదలుగా నెంద
ఱేనిఁ బ్రఖ్యాతు లయిరి శ్రుతకీర్తియు శ్రుతదేవయు శ్రుతశ్రవయుఁ బృథయు
రాజాధిదేవియు నన నేవురు చెలియండ్రు గలిగిరి వారిలోన.

159


సీ.

శూరుఁడు పోరానిచుట్ట మౌకుంతిభోజునకుఁ దాఁ గుంతినాఁ దనయ గాగఁ
బృథ నిచ్చె నాయమ ప్రధితతేజుం డగు పాండుని భర్తగాఁ బడసి ధర్మ
మారుతశక్రాశ్విమహితాంశజన్ములఁ గనియెఁ బాండవుల నఖండయశుల
శ్రుతకీర్తి [3]వృద్ధశర్ముఁడు గరూశాధీశువల్లభ యై దంతవక్త్రుఁ గాంచె
తే. విను శ్రుతిశ్రవఁజైద్యుఁడు విగతరోషుఁ, డైన దమఘోషుం డుద్వాహమై యుదగ్రు
నరిభటాభీలు శిశుపాలు నాహిరణ్య, కశిపుతేజాంశసంభవుఁ గలుగఁజేసె.

160


వ.

శ్రుతిదేవకుం గేకయేశ్వరువలన నేకలవ్యుండు పుట్టి నిషాదులలోనం బెరిఁగె
రాజధిదేవి యావంత్యు లగువిందానువిందులం బ్రభవించె వసుదేవునకు బాహ్లి
కపుత్రి యైనరోహిణి ప్రథమపత్ని యై బలభద్రుం డాద్యుండుగాఁ గ్రమంబున
సారణుండు శరుండు దుర్దముండు [4]శమనుండు శ్వభ్రుండు పిండారకుండు [5]కుశ
కుండు గదుండు ననుకొడుకులం జిత్ర యనుకూఁతుం గాంచె నాచిత్రయ సుభద్ర
యనుపేర నెగడి కురువంశవర్ధనుం డయిన యర్జునుం జెందె.

161


ఉ.

దేవకి యాదిగాఁగ వసుదేవుఁడు దేవకుకూఁతు లందఱన్
దా వరుసన్ వివాహముయి తామరసేక్షణు నాద్యు నచ్యుతున్
దేవకియందుఁ గాంచె జగతీవర తక్కినవారియందుఁ దే
జోవిదితాత్ములం గనియె సూనులఁ బల్వుర నాగదాదులన్.

162
  1. నమిత్రుండును
  2. లోక
  3. పృథుకీర్తి
  4. మదనుండు
  5. కుశీవరుండు