పుట:హరివంశము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ.3

65


వ.

ఆపుణ్యచరిత్ర పవిత్రకుశసంస్తరణంబునం దగ్నిహోత్రసమీపంబున శయనించి
యుండఁ దదీయభర్త తత్సాంగత్యంబు ననుభవించె దానం జేసి ధూమవర్ణుం
డయ్యు నత్యంతదర్శనీయుం డగు ఋక్షుం డనుతనయుండు జనియించి జనలోక
పూజ్యంబగు సామ్రాజ్యంబున రాజిల్లె నట్టిఋక్షునకు సంవరణుండు పుట్టి.

101


ఉ.

క్షాత్రసమగ్రుం డైనకురుఁ గాంచెఁ గులైకధురంధరున్ జగ
జ్జైత్రవిచిత్రకర్మగుణసమ్మితు నాతఁడు గాఁడె యీ కురు
క్షేత్రము సేసె జహ్నుసుత సీమగఁ బూని ప్రయాగదాఁక లో
కత్రయపావనంబుగ నఖండితకీర్తిధనంబు సేకుఱన్.

102


వ.

అమ్మహీపతికి మహాధర్మపరిరక్షకుం డగుపరీక్షిత్తు జన్మించె నా జనపతికి జనమేజ
యుండు [1]శ్రుతసేనోగ్రసేనపూర్వజుం డై జననంబు నొందె నా జనమేజయునకు
సురథుండును సురథునకు విదూరథుండును విదూరథునకు ఋక్షుండును ఋక్షు
నకు భీమసేనుండును సుతు లై రివ్వంశంబునందు ఋక్షపరీక్షిజ్జనమేజయు లిద్ద
ఱిద్దఱును భీమసేనులు మువ్వురు నని యెఱుంగుము.

103


తే.

అనఘు భీమనేనునకు భవ్యప్రతాపు, డగు ప్రదీపుఁ డుద్భవ మొందె నతనిసుతులు
ప్రభులు దేవాపిశంతనుబాహ్లికులు త్రి, లోకవిఖ్యాతు లపగతశోకమతులు.

104


వ.

అందు దేవాపి కొండికప్రాయంబునన తపంబునకుం బోయి భార్గవచ్యవనునకుఁ
గృతకపుత్రుం డై దేవతలకు నాచార్యుం డయ్యె శంతనుండు రాజై జాహ్నవి
యందు భీష్ముని వాసవి యైన సత్యవతియందుఁ జిత్రాంగదవిచిత్రవీర్యుల నుత్పా
దించె విచిత్రవీర్యుం డనువానికి ధృతరాష్ట్ర పాండురాజులు వుట్టి రందు వైచిత్ర
వీర్యుం డగుపాండునిపుత్రుండు భవత్ప్రపితామహుం డర్జునుండు వంశకరుం
డైన యభిమన్యుం గనియే బాహ్లికునకు సోమదత్తుండు పుట్టె సోమదత్తసంభవులు
భూరిశ్రవశ్శలశల్యులు మువ్వురు పుట్టిరి బహుశాఖి యైన పూరునిసంతతి
యంతయు నెఱింగించితి నింక దుర్వసువంశంబును ద్రుహ్యుని గోత్రంబును
ననువు నన్వయంబును గ్రమంబున వేర్వేఱఁ జెప్పెద నాకర్ణింపుము.

105

దుర్వసువంశక్రమంబు సంక్షేపంబుగాఁ జెప్పుట

సీ.

వహ్ని సమాఖ్యు దుర్వసుఁ డాత్మజు[2]నిఁ గాంచె గోభానుఁ డావహ్ని కొడు కతనికిఁ
ద్రేసానుఁ డనఁ బుట్టె ద్రేసానునకుఁ గరంధముఁ డుద్భవించె నద్ధరణిపతికి
ధుర్యచిత్తుడు మరుత్తుండు నాఁగ జనియించె సంవర్తయజ్వుఁడై చను మరుత్తుఁ
డధిప యీతఁడు గాక యన్యుఁడు సు మ్మిమ్మరుత్తుఁ డపుత్రుఁడై రూఢతేజు


తే.

భరతజనకుఁడు దుష్యంతు భ్రాతయైన, ఘనుని దిష్యంతుఁ దగఁ బెంచుకొనియెఁ జూవె
యివ్విధమున దుర్వసువంశ మేగుదెంచి, బూరువంశ మిశ్రకమయ్యెఁ బౌరవేంద్ర.

106
  1. శ్రుతసేనుండు నుగ్రసేనుండు భీమసేనుండు జననంబునొంది రందు
  2. గనియె