పుట:హరివంశము.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

పూర్వభాగము - తృతీయాశ్వాసము

శ్రీమత్పంటకులాంబుధి
సోమ [1]చిరయశోమహత్త్వశోభతలోభ
వ్యామోహరహితకోమటి
[2]వేమ సమిద్ధప్రతాపవిపులస్తోమా.

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునులకు జెప్పె నట్లు పితృసమారాధనవిశేషం
బులు వివరించి వైశంపాయనుండు జనమేజయునకు మరియు ని ట్లనియె. వృష్ణి
వంశప్రసంగంబున ని ట్లన్నియుం చెప్పితి నింకఁ దన్మూలం బైన సోమాన్వయ
క్రమంబు వినుము పరమేష్టికి మానసపుత్రుం డగు నత్రిమహాముని యఖిలలోక
హితార్థంబు మనోవాక్కాయకర్మంబులు ధర్మంబునం దగులం గాష్ఠకుడ్యశిలా
సదృశుం డై నిలిచి యూర్ధ్వబాహుతయు నిర్నిమేషావలోకనంబును సర్వలోకా
సాధారణంబుకు నై యమర మూడువేలదివ్యవర్షంబులు మహాతపంబు గావించి.

2


క.

తనశుక్ల మూర్ధ్వగతముగ, నొనరించిన నశ్రుబిందు [3]లొలికి యతనిలో
చనములఁ గాంతిమయము లై, యనయము నొకప్రోవు గట్టి యవి వెలుఁగంగన్.

3


మ.

అది సోమాహ్వయ మైన గర్భముగఁ బ్రేమాయత్త లై దిక్కులా
పదియుం గైకొని కాల్చి యంతన భరింపంజాల కుర్విస్థలిన్
బ్రిదులన్ వైచినఁ జూచి యక్షణమ సంప్రీతిన్ విరించుండు వ
చ్చి దయాలీల యెలర్పఁగాఁ ద్రిభువనక్షేమక్రియాకాంక్షి యై.

4


క.

సితవాజిసహస్రసమం, చితమగు తేరిపయి నిడినఁ జెలువొందె మహా
ద్యుతి యగు గర్భము సోముం, డితఁ డన బాలుఁ డయి వేల్పు లెల్ల నుతింపన్.

5


వ.

ఆసమయంబున భృగ్వంగిరసప్రముఖులగు చతుర్ముఖతనయు లతని ననేకంబు లగు
ఋగ్యజుస్సామసూక్తంబులఁ బ్రస్తుతించిరి తత్తేజంబున జగంబులెల్ల నాప్యా
యనంబు నొందె గర్భపాతంబు నప్పుడు సెదరి పుడమిం బడిన కాంతిశకలంబులు
మహోషధు లై యొప్పె నట్లు జనియించిన కుమారుండు.

6
  1. సమ
  2. వేమానుసమిద్ధచారు
  3. లొలికె నతని