పుట:హరివంశము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము .. ఆ. 2

53


తే.

అఖిలజంతుభాషావేది వైన నిన్ను, నధిప యే నెఱుఁగనె విషయానుభూతిఁ
దగిలి పూర్వజాతిస్మృతి దప్పియున్నఁ, దెలుపుటకు నిట్లు చేసితిఁ దెఱఁ గొకండు.

230


క.

మును [1]చెడిపోయినయోగము, మునికృప యిటుచేరె నింక ముద మెసఁగ నిరం
జనసిద్ధమార్గ మారసి, చనువార మనన్యసులభసంపత్తిమెయిన్.

231


వ.

అని యి ట్లన్యోన్యధన్యతాకథనం బొనర్చుచు నరిగి కండరీకుండును శ్రుతికిం
గ్రమప్రణయం బొనర్చి కృతార్థతం జెందె బాభ్రవ్యుండు శిక్ష యుత్పాదించి
యోగాచార్యగతిం బ్రాపించె నివ్విధంబు మార్కండేయుండు సనత్కుమారు
వలన భవిష్యద్రూపంబుగా విని పిదపం దానుం బ్రత్యక్షంబుగాఁ గని నా కెఱిం
గించి యిట్లనియె.

232


క.

శంతనుతనూజ యీకథ, యంతయు విని ధన్యతముఁడ వైతి మనసునం
జింతింపుము దీనిన య, త్యంతశుభావాప్తి యగు ననంతనిరూఢిన్.

233


శా.

ఈయాఖ్యాన మెఱింగి చిత్తమునయం దేప్రొద్దు మోదించువాఁ
దాయుష్మంతుడు శ్రీసమేతుండునుఁ బుత్రానేకపౌత్రోదయ
శ్రేయోనిత్యుఁడు నై సుఖోన్నతి గనుం జెందండు తిర్యగ్జనిన్
ధీయోగంబున నొయ్యనొయ్యన విముక్తిం గాంచు సిద్ధుం డగున్.

234


వ.

అని చెప్పి యమ్మునీంద్రుండు నిజేచ్ఛం జనియె నిది పితృకల్పప్రకారంబు చిత్తా
యత్తంబుగా నొనర్పు మనిన భీష్మభాషితంబులకుం బరితోషంబు నొంది ధర్మనం
దనుం డతని నభినందించె నని వైశంపాయనసూక్తం బైన కథావిధానంబు మధు
రంబుగా.

235


ఉ.

చంచనచంద్రచంద్రధరశారదనీరదనారదామృత
స్యందిముకుందపూర్వభవహారహరీభహరాద్రిహంసహీ
రేందువినిందకస్ఫురదుదీర్ణయశోర్ణవపూర్ణసర్వది
క్కందర నంద దిందిర జగజ్జనసుందర ధైర్యమందరా.

236


క.

సర్వధురీణగుణోదయ, సర్వజ్ఞోదాత్తవృత్తసంసిద్ధియశో
గర్విత మల్లచమూవర, నిర్వంచకసోదరత్వనిత్యారాధ్యా.

237


మాలిని.

కదనదళదమిత్రక్షత్ర [2]గోత్రప్రతానో
త్సదననివహభూరిచ్ఛత్రభవ్యోపధాత్రీ
పదపరి తదృప్యద్భార్గవాభీలఖేలా
భ్యుదిత[3]పరమసామ్యస్ఫూర్తిమత్తీవ్రఖడ్గా.

238


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసదోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షుణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునందుఁ బూర్వభాగంబున ద్వితీయాశ్వాసము.

  1. పడి
  2. గాత్ర స్రుతాసృగ్ ఘ్రదనినహకురుక్షే త్రాయితానేక
  3. పరశుసార