పంచమాశ్వాసము 75
తే. నెదురుగా నల్ల నేతెంచి హేమపాత్ర, నాజ్యమధుశర్కరాఫలాద్యర్హితముగ
మదనవైరికి నర్పించె మంజుఘోష, యమృతదివ్యాన్నపాయసాహారభిక్ష. 44
శా. అక్షయ్యంబుగ దివ్యమాధుకరభిక్షాన్నంబు వడ్డించెఁ దా
గోక్షీరంబులతోడ శర్కరలతోఁ గ్రొన్నేతితోఁ దేనెతో
ద్రాక్షాదాడిమచూతపాకములతో దాక్షాయణీభర్తకున్
చక్షూరాగ మెలర్పఁగా హరిణి విశ్వాసంబుతో ముంగిటన్. 45
ఉ. అల్లనఁ జేర వచ్చి ధవళాన్నముఁ గమ్మని యానినేతితో
బెల్లముతోడ నాల్కడపుఁబేసముతోడను నిమ్మపండ్లతో
వల్లభుకూర్మి నెచ్చెలికి వారణవైరికి మంచుగొండరా
యల్లునికిం బినాకికిఁ బ్రియంబున నూర్వశి పెట్టె భిక్షమున్. 46
ఉ. పెట్టెఁ దిలోత్తమాప్సరస భిక్ష ప్రియంబున భూతభర్తకున్
గట్టెఁ బసిండి శర్కరలఖండముతోడ ఘృతంబుతోడఁ గ్రొం
బట్టుఁబసిండి సిబ్బిలపుఁబయ్యెదకొం గొకకొంత జాఱి చ
న్గట్టు లలాటలోచనునికన్నులు మూఁటికి విందు సేయఁగన్. 47
తే. సహజసౌజన్య సహజన్య శంకరునకుఁ, బొసఁగ వడ్డించెఁ దత్కాలపుణ్యభిక్ష
సారదోర్మూలకూలంకషంబులైన, వీఁగుఁబాలిండ్లు పయ్యెద వీడుకొలుప. 48
క. విశ్వచతుర్దశభువనా, ధీశ్వరునకు భక్తియుక్తి నెసకంబెసఁగన్
విశ్వాచి యనెడునచ్చర, శశ్వన్మధురాన్నభిక్ష సమ్మతిఁ బెట్టెన్. 49
తే. కనకనూపురమేఖలాకలకలంబు, రత్నకంకణరవముతో రాయిడింప
నభవునకుఁ బెట్టె మధురదివ్యాన్నభిక్ష, చిత్తభవకీర్తిశశిరేఖ చిత్రరేఖ. 50
వ. మఱియుం దక్కులేఖాంగనలు భుజంగభూషణంనకు నపొంగరంగస్థలలాస్యలంపటంబులగు కటాక్షవీక్షణంబులతోడఁ గూడ భిక్షాహారంబులు సమర్పించిరి కందర్పసూదనుండునుం బ్రతిమందిరంబునం జందనకుసుమధూపదీపాద్యుపచారంబులు గ్రహించుచు నవ్వేశవాటంబున భిక్షాటనక్రీడ సలిపి యంతం దనివిసనక కనకగర్భకపాలపాత్రం బర్ధపూర్ణంబై కరపల్లవంబున నుల్లసిల్ల నల్లనల్లన యోగపాదుకాయుగళంబు గల్లుగల్లున మ్రోఁగ మునిజనాశ్రమంబుఁ బ్రవేశించి మునిమందిరముల మోసలల నిలిచి 'భవతి భిక్షాం దేహి' యటంచు వారివాహగర్జాగంభీరస్వరంబునఁ బలుకుచుఁ గులాంగనాజనంబు నపాంగదృక్తరంగంబులం జిఱునగవు లిసిఱింతలువాఱఁ గనుంగొనుచు సంయమివధూపాతివ్రత్యభంగంబు తనకుం బరమప్రయోజనంబుగా గర్భోక్తిసందర్భంబుల నిజాభిలాషంబుఁ దేటపఱచుచుఁ బర్యటింపం దొడంగిన. 51