పుట:హరవిలాసము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 హరవిలాసము

విద్యాధరాభిసారికామనోరథపదానురోధనిర్ణిరోధనిరవగాఢసంబాధప్పథులతమతమాలవీథీతిలకంబును నైననయక్కొండదక్షిణభాగంబున నుండుదాక్షాయణీవనంబున కనతిదూరంబున. 26

సీ. కర్ణికామాణిక్యకనకపద్మినులతోఁ గల్పవల్లీకుడుంగములతోడ
విమలచింతారత్నవేదికాస్థలులతో సిద్ధరసాపగాశ్రేణితోడ
దివ్యలోకాప్సరఃస్త్రీకదంబముతోడఁ గామధుగ్ధేనుసంఘములతోడ
దివ్యౌషధీలతాదీపమాలికలతో సకలర్తుసన్నివేశంబుతోడ
తే. మదనవైరికి గారాపుమామ యైన, మంచుగుబ్బలిఱేని సీమాంచలమున
దేవతామునిసేవ్యమై తేజరిల్లు, ధర్మసంజీవనము దేవదారువనము. 27

క. అందు వసియించు సంయమి, సందోహము పంచబాణసదృశము లీలా
సౌందర్యకళానిర్జిత, బృందారకసతులు వారిబింబాధరలున్. 28

సీ. జిలుఁగైనకనకంపుఁజీనాంబరముకొంగు పాలిండ్లబింకంబు బయలుపఱప
భ్రమరకంబులఁ జుట్టుప్రస్వేదకణములు నొసలికస్తురిబొట్టు నూలుకొలుప
దరవిశ్లథం బైనధమ్మిల్లభారంబు చిమ్మచీఁకటులకుఁ జిట్టమిడువఁ
దరళహాటకరత్నతాటంకదీప్తులు చెక్కుటద్దములపై జీరువాఱ
తే. బసిఁడికుండల నిర్ఝరాంభస్సుఁ దెచ్చి, పోయఁ గంకణనిక్వాణములు సెలంగఁ
గన్యలతలకు మునికన్యకాకదంబ,మభిమతం బైనయప్పావనాశ్రమమున. 29

క. జ్యోతిప్టోమాదిముఖ, త్రేతానలపుణ్యధూమరేఖామృతగం
ధాతిరయం బడఁగించుం, బాతకసంఘము తదీయపర్యంతమునన్. 30

ఉ. సమ్మదలీలతోఁ జదువు సామము లేడును గండుఁగోయిలల్
తుమ్మెద లాలపించుఁ బరితోషమునం బ్రణవాక్షరంబులన్
సమ్మతిఁ బ్రస్తవించు శుకశారిక లాగమభాషితంబులన్
నెమ్మదిఁ జెప్పు శాస్త్రముల నీలగళంబులు తద్వనంబునన్. 31

శా. కాముం జీరికిఁ గోక క్రోధము నహంకారంబు లోభంబు నీ
ర్ష్యామాత్సర్యమదావలేపకుహనారాగంబులం జేర నీ
కాముష్యాయణు లై ప్రశాంతమతు లై యయ్యాశ్రమాంతంబుల౯
సేమం బొప్పఁగ సంచరింతురు మునుల్ నీవారముష్టింపచుల్. 32

శా. ఆనందంబునఁ ద్రుళ్లుపుచ్ఛములు పెల్లల్లార్చుచున్ లేఁగ ల
క్కానన్ గోకులగోష్ఠదేశముల జంఘాలాఘవం బొప్ప హో
మానుష్ఠానవిధిప్రకారపరతంత్రాత్మప్రసూకామధు
గ్ధోనోదన్యసుధాప్రవాహలహరీతృప్తాంతరంగంబు లై. 33