పుట:హరవిలాసము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 61

దంగీకరించుటకు సకలభూతాంతర్యామి వగునీవ ప్రమాణంబు. మాటలు వేయు నేటికిఁ జింతితోపస్థితుల మైనమమ్ము నేపనిపంపునఁ దలంచితిరో యానతిం డనుటయు. 45

చ. లలితజటాకిరీటసదలంకృత మైనశశాంకరేఖ కో
మలరుచి దంతదీధితిసమాజముతోఁ బొదలంగఁ జేయుచున్
బలికె లలాటలోచనుఁడు ప్రస్ఫుటభంగి మునివ్రజంబుతోఁ
దొలకరిమేఘఘోషములతోఁ బురణించు సమంచితధ్వనిన్. 46

తే. ఎఱుఁగుదురు కాదె మీరు నాహృదయవృత్తి, నాకొఱకు నేన వర్తింతు నేకృతులను
మన్మహామూర్తు లెనిమిది మౌనులార, భువనరక్షాప్రయోజనంబునక కాదె. 47

తే. విప్రకృతు లైనయబ్బందివేల్పు లెల్ల, మనఁగఁ గోరిరి సేనాని మత్ప్రసూతి
ననఘులార తృష్ణాతురు లైనవారు, వారివాహంబు ఘనవృష్టిఁ గోరినట్లు. 48

వ. ఏతదర్థంబ పార్వతిని ధర్మపత్నిఁగా నపేక్షించు చున్నవాఁడ మాకొఱకు మీరు హిమాచలంబునకుం బోయి యక్కార్యంబు సంఘటింపవలయు యుష్మత్సంఘటితంబు
లైనసంబంధముల కెన్నండును వికారంబు పుట్టనేర దభ్యున్నతుండును స్థితిమంతుండును వసుంధరాభారధూర్వహుండును నగునద్ధరాధరసార్వభౌముండు సంబంధబాంధవార్హుండు కన్యార్థంబ యిటు ప్రవర్తింపుఁడు భవత్ప్రణిహితంబు లైనపురాణాగమాదులు గదా లోకవ్యవహారంబులకు నిదర్శనంబు లై యుండు నీయరుంధతీదేవియు నీకార్యంబునకు సహాయ కాఁగలదు విశ్లేషించి వివాహశోభనకార్యంబులయందుఁ బురంధ్రీజనంబులకుఁ జనవుచెల్లు నిది శుభముహూర్తం బిప్పుడ కదలి యోషధిప్రస్థపురంబునకుం జనుండు కైలాససానుప్రదేశంబులఁ బునస్సమాగమం బగుం గాత మని శంభుండు విస్రంభగంభీరంబుగా నానతి యిచ్చిన. 49

చ. అతఁడు సమస్తసంయమిజనాద్యుఁడు శైలసుతాపరిగ్రహా
యతుఁ డయి యుండఁగా సురమహర్షివరేణ్యులు ప్రాక్తనప్రజా
పతులు తదాదిగా హృదయపంకరుహంబులతోఁ బరిగ్రహ
వ్యతికరసంభవం బయినయచ్చపులజ్జ పరిత్యజించుచున్. 50

వ. మహాప్రసాదం బని యంబరమార్గబున హిమవంతంబు డాయం జని. 51

తే. గగనమున నుండి డిగ్గి సత్కారయుక్తి, వెలిఁగె హిమపర్వతాంతరస్థలమునందు
నిర్మలం బైననిధిలోని నీడఁ దోఁచు, నిందుబింబంబులను బోలి ఋషిగణంబు. 52

శా. పాదన్యాసములన్ ధరిత్రి పరికంపంబొంద నత్యంతస
మ్మోదంబున్ భయభక్తులున్ మనమునన్ ముట్టంగ శైలేంద్రుఁ డం
భోదాకారముతోడ డిగ్గి నమ్మహాపుణ్యాతులన్ సర్వలో
కాదిశ్రేష్ఠుల వే యెదుర్కొనియె నర్ఘ్యాపూర్ణహస్తాబ్జుఁడై. 53