పుట:హరవిలాసము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

పీఠిక.

ఈతని కవిత్వమునం బ్రాయికముగాఁ గన్నడపదములు గనఁబడుచున్నందునను -

శ్రీనాథుని జన్మస్థానము కర్ణాటదేశమనుట సమంజస మనియు నీతఁడు కర్ణాటదేశమున జన్మించినను శైశవముననే యీతని తలిదండ్రు లుద్యోగవశముననో మఱియు నేకారణముననో కొండవీటిసీమకు వచ్చి యుందురనియు నింటిలోఁ దలిదండ్రులతో మిశ్రకర్ణాటము మాట్లాడుచున్నను బాల్యమునుండి తెలుఁగుదేశములోఁ దెలుఁగువారితోఁ గలసిమెలసి యున్నందుసఁ దెలుఁగువానివలెఁ దోఁచుచున్నాఁ డనియుఁ బల్నాటివీరచరిత్రపీఠికాకారులవాదము.

ఈ వాదమునకుఁ బ్రతికోరు ననుసరించి యాంధ్రులచరిత్ర మూఁడవభాగములో "కర్ణాటకటకపద్మవనహేళి" అసు విశేషణము కర్ణాటదేశాధిశుని (దేవరాయల) నిండోలగంబునఁ బాండిత్యశౌండీర్యంబున నుద్దండుఁ డగుడిండిమభట్టారకు నోడించి ప్రభుపండితసమ్మానపూర్వకంబుగఁ గవిసార్వభౌమబిరుదమున నలరారుటయ కాక యక్కవిసూర్యుఁడు కర్ణాటరాజధాని (యందలి విబుధరాజి) యనుకమలవనమునకు సూర్యుఁడై యుండెనను నభిప్రాయమునఁ దనకుఁ గూర్చుకొనియెఁ గాని కర్ణాటదేశాభిమానమునం గాదనియు,

"నాకవిత్వంబు నిజము కర్ణాటభాష” అనుపద్యము రాజమహేంద్రవరాధీశుమంత్రి బెండపూడియన్నయామాత్యునకుఁ గృతి యిచ్చిన భీముఖండములోనిదిగాన కోమటి వేమభూపాలుమరణానంతరము కొండవీటిరాజ్యము కర్ణాటాధీనము గాఁగా శ్రీనాథుఁ డన్నామాత్యుబాంధవ్యమును బట్టి రాజమహేంద్రవరమున కేతెంచి తద్రాజాస్థానకవీశ్వరుఁడుగ నున్న కాలమగుటచేఁ గాకతీయరాజ్య మంతరించినపిదప నాంధ్రదేశమున దక్షిణభాగము (పాకనాటిసీమవఱకుఁ గలదేశము) కర్ణాటరాజ్య మనఁ బరఁగుచున్నందున నచ్చటివాఁడగు శ్రీనాథుని గుఱించి రాజమహేంద్రవరపుంగవులు కొంద ఱీతని కవిత్వము సంస్కృతమనియుఁ గొందఱు కన్నడమనియు వంకలుపెట్ట “నెవ్వరేమన్న నండ్రు నాకేమికొఱఁత, నాకవిత్వంబు నిజము కర్ణాటభాష" యని యుత్తరము చెప్పియుండు ననియు,