పుట:హరవిలాసము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము. 45

వ. అని చెప్పి నారదుండు సనియె నంతనుండి హిమవంతుండు నివృత్తాన్యవరాభిలాషుండై యయ్యోషారత్నంబు శేషభూషణునకు నీ నిశ్చయించియు నభ్యర్థనాభంగభయంబునం జేసి. 27

క. త న్నడుగ రానిశివునకుఁ, గన్నియ నె ట్లిత్తు నతనికారుణ్యము నా
కెన్నఁడు సిద్ధించునొ యని, యన్నగపతి యాత్మఁ దలఁచె నౌత్సుక్యంబున్. 28

వ. అంత విరూపాక్షుండు దక్షరోషంబు కారణంబు గా దాక్షాయణి శరీరమోక్షంబుఁ
జేసినది మొదలు గా సర్వసంగపరిత్యాగంబుఁ గావించి యపరిగ్రహుండై. 29

సీ. గంగాప్రవాహసంక్షాళితాభ్యున్నత రుద్రాక్షదేవదారుద్రుమంబుఁ
గస్తూరికాకురంగజనాభిపరిమళ శ్లాఘ్యేందుకాంతపాషాణతలముఁ
గిన్నరద్వంద్వసంభిన్నపంచమరాగ నిర్యన్మహావేగనిర్ఘరాంబు
పతితప్రతిధ్వానభంగోరుఘుమఘుమ ఘుమఘుమాయతదిశాగోళకంబు
తే. నైనహిమశైల పాదంబునందు నియతిఁ, దపము సేయంగ మదిలోనఁ దలఁచి విడిసెఁ
బ్రమథవర్గంబుఁ దానును బసవ డపుడు, కృత్తివాసుండు విషయనివృత్తుఁ డగుచు. 30

తే. ప్రమథు లెల్లరు విడిసి రప్పర్వతమునఁ, జంద్రకాంతశిలామణిస్థలములందు
నమరియుండునమేరువృక్షములనీడ, భూర్జతరుచర్మపరిధానములు ధరించి. 31

చ. బసవఁడు ఱంకె వైచి హిమపర్వతసారువనాంతరంబులం
బసిరిక మేసి నిర్ఝరులఁ బాఱెడుతియ్యనినీరు గ్రోలి క్రొ
వ్వొసఁగ ఘనాఘనధ్వనుల నుల్లస మాడెడుఁ దత్పురంబునన్
బ్రసభగతిన్ మృగేంద్రములు భద్రగజంబులు భీతిఁ జెందఁగన్. 32

తే. ఆత్మమూర్త్యంతరం బైనయగ్నిదేవు, నర్చనముఁ నేసి నియతి నయ్యష్టమూర్తి
బహుతపోవ్రతనియమైకఫలవిధాత, తపముఁ జేసెను మది నొక్క తలఁపుఁ జేసి. 33

తే. అపుడు హిమవన్నగేంద్రుఁ డత్యాదరమున, నతిథియై యున్న శంభున కర్చ లిచ్చి
తత్సమారాధనక్రియార్థమునఁ బంచె, నిజతనూజ నజినసమన్వితము గాఁగ. 34

క. రమణి తపోవ్రతచర్యా, సమధికవిఘ్నంబ యనుచుఁ దలపోసియు శీ
ఘ్రము గైకొనె శివుఁడు వికా, రము లేక మదిం దపంబు రమణీమణియున్. 35

సీ. పాటించుఁ బువ్వులు పల్లవంబులు గోయుఁ గుశపవిత్రంబులుఁ గూడఁబెట్టు
నాపగ రహి మీఱు నర్ఘ్యోదకములును నుపకరణంబులు నొయ్యఁ జేర్చు
వేదికాసమ్మార్జవిధి నివర్తించును లీలమై రంగవల్లిక లొనర్చుఁ
గల్పించు లెస్సగా గంధాక్షతంబు లుత్పాదించు ధూపదీపాదికములు
తే. ప్రత్యహంబును హిమధరరాజతనయ, భవునిపదపద్మములమీఁద భక్తి గలిగి
తచ్ఛిరశ్చంద్రచంద్రికాస్తబకశైత్య, శాంతపర్యటనక్రియాశాంతి యగుచు. 36