పుట:హరవిలాసము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

హరవిలాసము



వ. అనంతరంబ ప్రతిదినవర్ధమాన యై లబ్ధోదయ యగుచంద్రరేఖయుం బోలె బంధుజనంబులకుఁ బ్రమోదంబు నందించుచు మందాకినీసైకతవేదికాస్థలంబులఁ గంచుకక్రీడ సల్పుచు నుపదేశకాలంబుల విద్యలు నేర్పుచు బాల్యంబుఁ గడపి నేత్రోన్మీలనంబు సేసిన చిత్రంబునంబోలె యౌవనవిభక్తం బై యభ్యుదయం బై యభ్యున్నతాంగుష్టనఖప్రభావిక్షేపంబున రాగంబు వెడలు గ్రక్కునవియుం బోనిచరణప్రవాళంబులు వృత్తానుపూర్వంబు లై యనతిదీర్ఘంబు లగుజంఘాప్రకాండంబులును వేదండశుండాదండంబులకు వైదండికంబు లై యొప్పారునూరువులును మేఖలాకలాపమధ్యకీలితమహేంద్రనీలమాణిక్యకిరణరేఖయుంబోలె నాభిరంధ్రంబునం బుట్టి మీఁదికి నిగుడ రాజిల్లు రోమరాజియును నవయౌవనారోహణార్థంబు మన్మథుం డొనర్చిన మణిసోపానంబులంబోని వల్లీవిభంగంబులును గుదుళ్ళు నిండఁ బలుకం బండిన మారేడుపండ్ల గారాముఁ జెఱుచు గబ్బిగుబ్బలబెడంగులును నభినవశిరీషకుసుమసుకుమారంబు లగుబాహువులును ధర్మబంధురం బగుకంధరంబును సంపూర్ణపూర్ణిమాచంద్రబింబంబుడంబు విడంబింపం జూచునాననంబును గావియగు మోవియును నూఁబూవువంటి నాసికయు నిద్దంపుటద్దమ్ములకుఁ దోడిముద్దు లగుముద్దుచెక్కులును సుమకోదండపల్లీమతల్లు లగుకఱివంక బొమలును విదియనాఁటిచందురునకుం గదిసి చుట్టం బగులలాటపట్టంబును గొదమతుమ్మెదనాలుఁ బురుడింపం జాలునీలాలకంబులును నొప్ప సర్వోపమాద్రవ్యసముచ్చయం బగుసౌందర్యంబు నేకత్రావస్థానదిదృక్షచే విరించి సూక్ష్మీకరించి యథాప్రదేశనివేశితంబుగ నొనర్చెనో యనం దల్లిదండ్రులకు నామోదంబు నాపాదించుచుండ నొక్కనాఁడు నారదుండు సనుదెంచి. 23

క. త్రిభువన మోహన యగున, య్యిభగమనం జూచి పర్వతేశ్వరునిమహా
సభలో నిట్లని పలికెను, శుభవచనప్రౌఢి మెఱయ సురముని యెలమిన్. 24

సీ. ఈ నీరజాతాక్షి మేనిలో సగపాలు గణుతింప మగపాలు గాఁగ నున్న
దీపల్లవాధర శ్రీపాదపద్మంబు నొరయు నొక్కొక్కమా టుడుగణేశుఁ
డీకాంతతోడ మందాకినీవాహినీ సవతి గాఁ గల దేమిచందమునను
నీలతాతన్వికి నీరేడులోకంబు లభిరామకేళివార్యంబు లగును
తే. నిండువేడుకఁ గాంచు నీనీలవేణి, కొమ్ముటేనుంగుమొగ మైన కొడుకుఁగుఱ్ఱ
నత్తయును మామయును లేనిరిత్తయింట, మనువు మనిపెడు నీయింతి మగనితోడ. 25

ఉ. మాటలు వేయు నేమిటికి మంగళలక్షణలక్ష్మి యైనయీ
జోటికి భర్త కాఁ గలఁడు సోమకిరీటుఁడు సర్వదేవతా
కోటికిరీటకోటిపరికుంచితదివ్యమణిద్యుతిచ్ఛటా
పాటలపాదపీఠుఁ డగుపట్టి కృతార్థుఁడ వైతి భూధరా. 26