పుట:హరవిలాసము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము


శ్రీపర్వతసోపాన
స్థాపక వేమక్షితీశసామ్రాజ్యశ్రీ
వ్యాపారిముఖ్య యన్వయ
దీపక యలకాధిరాజ దేవయతిప్పా! 1

వ. ద్వితీయవిలాసం బైన గౌరీకల్యాణం బాకర్ణింపుము. 2

ఉ. తారకుఁడన్ మహాసురుఁడు తామరసాసనదత్త మైనదు
ర్వారవరానుభావమున వ్రాలి త్రిలోకము నేలుచుండు ని
ష్కారణతీవ్రబాధ ననిశంబును ముప్పదిమూఁడుకోట్లబృం
దారకులన్ మహర్షులఁ బ్రతాపగుణంబున నెచ్చి పాఁతుచున్. 3

తే. నిరపరాధబాధితు లగు నిర్జరులకు, బంధమోక్షంబుఁ గావించు గంధవహుఁడు
సతులపయ్యెద వెడలించి చన్నుఁగవకుఁ, దప్పు సేసియు దైత్యుచిత్తంబు వడసి. 4

మ. ప్రకటస్నేహదశాధురంధరత పర్వంగా నిశీధంబులన్
సకలాంగంబులు నిక్కి దీపకలికాస్తంభంబులై యుంద్రు పా
యకచూడామణు లొప్ప రాక్షసునిశుద్దాంతంబులన్ శేషవా
సుకికర్కోటకతక్షకప్రముఖచక్షుశ్శ్రోత్రబృందారకుల్. 5

తే. దానవునివీటిలోన మార్తాండుఁ డెండ, యంతమాత్రంబ కాని కాయంగ వెఱచు
నెంతమాత్రము కాసిన నెలమిఁ బొందు, గేళిదీర్ఘికలందుఁ బంకేరుహములు. 6

మ. పటుదిగ్వారణగండమండలలసత్ప్రత్యగ్రదానచ్చటా
కటుగంధం బగునీరు చిక్కనివియద్గంగాప్రవాహంబులో
పటిహైమాంబుజనాళముల్ పెఱికి యూడ్వం జేయు దేవాళిచే
నిటు దైతేయుఁడు గేళిదీర్ఘికలలో నిచ్ఛావినోదంబుగన్. 7

తే. ఐంద్రమాసుర మాగ్నేయ మైలబిలము, వాయవీయ మైశానంబు వారుణంబు
యామ్యమును మున్నుగాఁ గలయష్టదిశలు, తాన కైకొని కైకోఁ డతండు సురల. 8