పుట:హరవిలాసము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జంగమప్రమథుల నారాధించుచుఁ గల్పాంతకాలకల్పంబులైన యాదుర్దినంబుల నియమం బుపద్రవంబు నొందకుండం గాపాడుకొనుచు నుండె నిట్లుండ నవ్వాన వెలియుదినంబు సంప్రాప్తించె. 33

తే. ప్రతిదినంబును జంగమప్రమథముఖ్యు
డొకఁడు మొదలుగ మఱి యెంద ఱొదవకున్న
నారగింపనిబాసవాఁ డగుటఁ జేసి
నాఁడు పుణ్యుండు చిఱుతొండనంబివిభుఁడు. 34

వ. మధ్యాహ్నకాలంబున వీరమాహేశ్వరసమయసిద్ధాంతమార్గానుసారంబున. 35

ఉ. ధీనిధి సెట్టితంబి తనదేహమునిండ విభూతి మంగళ
స్నానముఁ జేసి ధౌతపరిధానముఁ గట్టి త్రిపుండ్రధారియై
చే నమృతాశుమౌళిని వశీకృతభక్తు ధరించి సంతత
ధ్యానముఁ జేసి యెంతయును దత్పరభావము ప్రస్ఫుటంబుగన్. 36

సీ. జలక మార్చె నవీనచంద్రార్ధమౌళికిఁ దడి యొత్తె భక్తమందారమునకుఁ
జందనం బర్పించె జగదేకభర్తకుఁ బుష్పమాలిక లిచ్చె భూతపతికి
ధూపంబు సంధించె దురితసంహరునకు దీప మిచ్చెను మహాదేవునకును
దాంబూల మొనరించె నంబికాధవునకుఁ బ్రణమిల్లె జగదైత్యభంజనునకు
తే. జంగమారాధనక్రియాసమయమునను, గాని యుపహార మీరానికారణమున
దేవదేవుని విరిసెజ్జఁ దిరము సేసి, వాకిటికి వచ్చె శివయోగివరుల నరయ. 37

క. ఏవేళఁ జూచినం దన, శ్రీవాకిటఁ బగటివేళ శివయోగివరుల్
వేవేలసంఖ్య లుండెద, రావేళ నొకళ్ళు లేమి యద్భుత మయ్యెన్. 38

తే. అప్పు డాశ్చర్య మంది వైశ్యప్రభుండు, మగుడి లోనికిఁ జనుదెంచి మంద్రఫణితి
నోలతాతన్వి శివయోగి యొకఁడు లేఁడు, నేఁడు మొగసాల నిది యేమి మూఁడె నొక్కొ. 39

చ. ముసురుదినంబులందు మనమోసలఁ బంచటరుంగుమీఁదటన్
భసితవిభూషణుల్ పరమపావనమూర్తులు శైవసంహితా
భ్యసనపరాయణుల్ గిరిశభక్తు లనేకులు నిండియుంద్రు నేఁ
డసితసరోరుహాక్షి యొకఁ డైనను లేఁ డిది యేమి చోద్యమో. 40

తే. వీథికై యేగి వత్తునా వేగవేగ, నేఁడుమాత్రము కొందఱు నియమపరులు
పాదసరసిజయుగళప్రసాదమాత్ర, మబ్బెదరు గాక మనభాగ్య మల్ప మగునె. 41

వ. అని పల్కి తిరువెంగనాచితో నేను జంగమప్రమథులం బురంబువీథుల వెదకి తేరం బోవుదుఁ గాన లింగార్చనములకుం దగినపదార్థంబు కూడం గూర్చుకొని యుండుమా యని చందనంబును భూతియుఁ జెందిరయుఁ బుచ్చికొని దుప్ప