Jump to content

పుట:హరవిలాసము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 హరవిలాసము

తే. హరిణవత్సంబులకు మీరు కరుణతోడఁ
బాయసాన్నంబు గుడిపింప భర్తఁ జూచి
సర్వభూతానుకంపకు సంతసిల్లి
చిట్ట మిడిచితి నిది నాకుఁ జెట్ట యయ్యె. 7

వ. నీవచనం బమోఘంబు గావున నాకు మర్త్యత్వం బవశ్యభోగ్యంబుగాఁ బురాకృతఫలం బనుభవింపక పోవచ్చునే నాయపరాధం బల్పంబ దీనికిం దగ శివభక్తగృహంబున జన్మించునట్టుగా ననుగ్రహించి శాపాంతంబు కృప సేయు నీకృపావిశేషంబునం గ్రమ్మరం బారిషపదవి కలుగునందాఁక మద్భార్య నీకుం గోడలు నీపాదచర్య సేయుచు నీయాశ్రమంబున నుండఁగలయది యని పల్కిన దాక్షిణ్యంబు వహించి యవ్విరూపాక్షదివ్యాంశభవుండగు దూర్వాసుండు. 8

ఉ. ఇద్దురవస్థ రాఁదగిన యింతటిత ప్పొనరించినాఁడ వే
ప్రొద్దుగుణంబున న్నెగులు వొందిన నేమి యనంగవచ్చు నీ
ముద్దియ నాదకోడ లిటముందట నావగ నెమ్మినుండ నీ
నిద్దుర మేలుకొన్నగతి నీవును గ్రమ్మరి రమ్ము పొమ్మిఁకన్. 9

వ. అనియె ననంతరంబ తుంబురుండు దూర్వాసశాపాక్షరంబులు ప్రేరేపఁ దత్క్షణంబ జంబూద్వీపంబున ద్రవిడభూమండలమండనాయమానంబును బంపాతరంగిణీప్రవాహనదీమాతృకాయమాన విశ్వంభరాభరితకలమశాలిశిరా ముఖషష్ఠికపతంగహాయనప్రముఖబహువిధవ్రీహిభేదసంపత్సంపన్నంబును బంకజాసనహయమేధయాగస్థానంబును హస్తిగిరిశిఖరశృంగాటకాఘాటగాటకఘటనావాసవరదరాజాభిధానవైకుంఠవిహారప్రదేశంబును గామాక్షీకౌతుకాగారంబును నేకామ్రనాథదేవదివ్యావసధంబునునైన కాంచీనగరంబున పణిగ్వంశంబున నుద్భవించి. 10

మ. చిఱుతొండండను పేర వైశ్యకుల మౌర్జిత్యంబునం బొంగఁగా
గఱకంఠుం దరుణేందుశేఖరుని షట్కాలంబు పూజించు నెం
దఱుభక్తు ల్దను వేఁడిన న్ప్రమదమున్ దాత్పర్యము న్భక్తియు
న్వెఱవుం గల్గి తదీప్సితార్థములు గావించు న్నిరాలస్యతన్. 11

వ. అతనిపురంధ్రి తిరువెంగనాంచి తుంబురునిభార్యయగు నప్సరోంగన నిజాంశంబునఁ గాంచీనగరంబునందు పణిగ్వంశంబునఁ గౌశికగోత్రంబున నవతరించి చిఱుతొండనంబికి భార్యయై సిరియాలుండను కుమారునిం గనియె నాపుణ్యదంపతు లిరువురు షట్కాలలింగార్చనంబులను సంతతజంగమారాధనంబులను గాలంబు గడపుచుండిరి. 12

తే. కంచిలో నేడువాడలు గలసియుంద్రు
ప్రకృతిబంధులు సంబంధబంధులునయి
పాఁడిపంటయు వైభవప్రాభవములు
తగవు ధర్మంబు గలిగి యుత్తమవణిజులు. 13