పుట:హరవిలాసము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 హరవిలాసము

తే. జగదగోపాల రాయవేశ్యాభుజంగ, పల్లవాదిత్య భూదాన పరశురామ
కొమరగిరి రాజదేవేంద్రు కూర్మి హితుఁడు, జాణ జగజెట్టి దేవయ చామిశెట్టి. 25

తే. తమ్ము లిద్దఱుఁ దనయాజ్ఞ దల ధరించి, యన్నిదీవులఁ దెచ్చు లాబార్థకోటి
యర్థులకు నిచ్చి గీర్తి బేహార మాడు, నవచి త్రిపురాంతకుండు వంశాబ్ధివిధుఁడు.

మ. తరుణాచీనితవాయిగోవరమణాస్థానంబులం జందనా
గరుకర్పూరహిమాంబుకుంకుమరజఃకస్తూరికాద్రవ్యముల్
శరధిం గప్పలి జోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
ర్పరియౌ వైశ్యకులోత్తముం డవచితిప్పం డల్పుఁడే యిమ్మహిన్. 27

తే. పండువాఢిల్లిరాఢాదిపట్టణముల, యధిపతులు మౌళిఁ దాల్చురత్నాంకురంబు
లవచిత్రిపురాంతకానీతయానపాత్ర, సింహళద్వీపమండితక్షేత్రజములు. 28

ఉ. పిన్నటనాఁడు సత్కరుణఁ బిల్లలమఱ్ఱిమహాప్రధాని పె
ద్దన్నగురూత్తముండు తగనక్షరశిక్షయు దైవమార్గ సం
పన్నతయున్ వివేకపరిపాటియునుం గృపసేసె నర్థి నే
యన్నకు నట్టిసెట్టి త్రిపురాంతకునిం దగుఁ బ్రస్తుతింపఁగన్. 29

ఉ. ధీచతురు ల్సహోదరులు తిర్మలసెట్టియు జామిసెట్టియున్
మాచన విశ్వనాథచినమల్లకుమారులు వీర లాత్మజుల్
శ్రీచెలువంబుఁ గైకొనిన చేడియ యన్నమదేవి భార్యగా
గోచరమే నుతింప నయకోవిదునిం ద్రిపురాంతకాధిపుల్. 30

షష్ఠ్యంతములు

క. ఆపుణ్యశ్లోకునకు ను, మాపతిపాదారవిందమధుకరమునకున్
ద్వీపాంతరమండలికా, భూపాలకమాననీయపురుషార్థునకున్. 31

క. సంధాభార్గవునకుఁ గి, ష్కింధాచలపతికి దానకేళీభరధౌ
రంధర్యనియతమతికి యు, గంధరచాణక్యనీతిగతినిపుణునకున్. 32

క. మాచాంబానందనునకు, వాచాగోచరవివేక వైయాత్యునకున్
వాచాలవిబుధగంగా, వీచీగంభీరవాక్యవిన్యాసునకున్. 33

క. వాణిజ్యచణున కంత, ర్వాణీసంస్తూయమానభాసురమతికిన్
వాణీనఖముఖముఖరిత, వీణానిక్వాణనిభకవిత్వఫణితికిన్. 34

క. త్రిపురాంతకదేవమనో, విపులగృపావర్ధితాభివద్ధికిఁ బాండ్యా
ధిపసఖున కవచిదేవయ, త్రిపురాంతకునకు వితీర్ణదీక్షానిధికిన్. 35