పుట:హరవిలాసము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112 హరవిలాసము

చితివి భవదీయసత్త్వసాహసంబులకుం గొలది యెక్కడి యది యని యర్జునుం బ్రస్తుతించి మాతలి రథంబు గ్రమ్మరించె, ఇట్లు నివాతకవచులఁ బరాభవించి భవ్యతేజోదుర్నిరీక్షుండై పాండవేయుండు మరలి వచ్చువాఁడు ముందట. 180

ఆ. వివిధవృక్షగుల్మవిస్తీర్ణమై కడుఁ, బొలుపు మిగులు నొకతపోవనంబు .
నతివిచిత్రశిల్ప మగుపట్టణంబును, నుజ్జ్వలంబు లగుచు నున్నఁ గాంచి. 181

క. సురసారథి యిది యెవ్వరి, పుర మిమ్మహనీయఘనతపోవిపినం బె
వ్వరిది యిది నాదృష్టికి, హరహర యతినిస్మయంబు నాపాదించెన్. 182

వ. అనవుడు నమ్మహాత్మునకు నాతఁ డిట్లనుఁ దొల్లి పులోమియు గోవికయు ననునసురకాంత లిత్తపోవనంబున దివ్యసహస్రవర్షంబు లత్యుగ్రనియమంబునం బద్మగర్భు నారాధించి తత్ప్రసాదంబునం గనకమయంబై కామగమనం బైనయిప్పురంబునం దనుసుతు లాహవంబునం ద్రిదశులఁ దొడరి వధ్యులు గాకుండ వరంబు వడసి రిది హిరణ్యపుర మిందుఁ బౌలోమ కాలకేయు లనునసురు లుండుదురు. వీర లింద్రాదిదేవతల కసాధ్యు లనిన నట్లేని యిప్పురంబుమీఁదం దేరు వఱపు మని ఫల్గునుండు మాతలిం బనిచిన. 183

సీ. సంవర్తమాతరిశ్వమనోహరరయమ్ము లగునశ్వములును దీవ్యద్విభూతిం
జిత్రచంక్రమము సుస్థిరనేమిఘోషంబు నత్యద్భుతంబు లై యంద మొంద
నమరారిపురముపై నాతఁ డుప్పరవీథి నరదంబు వరపిన నసురవరులు
వెస శతాంగములు షష్టిసహస్రకంబుతోఁ బెరసి యొక్కుమ్మడిఁ బురము వెడలి
తే. యింద్రుఁ డనుబుద్ధి నల్కతో నింద్రతనయుఁ
దాఁకి రార్చుడు నతఁడును దారుణాశ్మ
వృక్షజన్యంబు లగుశస్త్రవితతి యేసి
తద్రథాళికి గతినిరోధంబు సేసె. 184

వ. వారును మాయాయుద్ధనిబద్ధబుద్దులై తమపురంబులతోడ నంతరిక్షంబునకు నెగసిన నిశితశరనికరపంజరప్రపాతంబున నూర్ధ్వగతినిరోధంబు చేసి వారి నేలంబడ నేసి ఫల్గునుండు వీరి నన్యప్రకారంబున జయింపరా దని. 185

సీ. బ్రహ్లాదులును నాత్మ భావించి నిజముగా నేదేవుమహిమంబు లెఱుఁగలేరు
భూర్భువస్వర్ముఖంబులు లోక జాలంబు లేదేవుకృపఁ బేర్మి నెలమి చెందు
భక్తి నేదేవుని పాదపంకజములు తలఁచువారల కసాధ్యంబు లేదు
గజరాక్షసాదిమూర్ఖవ్రాతముల నెల్ల నేదేవుఁ డడఁగించి యింపుఁ జెందె
తే. భక్తపరతంత్ర మేదేవు భవ్యమూర్తి, యట్టిదేవుని హృదయంబునందు నిలిపి