పుట:హరవిలాసము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 హరవిలాసము

వ. అని మఱియు మఱియు సాష్టాంగప్రణామంబు లాచరించి నిలిచిన పాండవమధ్యముం జూచి ఖండపరశుండు నీతపంబునకుఁ బాశుపతవ్రతనిష్ఠాగరిష్ఠతకు భుజాశౌర్యంబునకు సంతసిల్లితి నీవరం బేదియె వేఁడు మనుటయు. 101

తే. అభవ! యీ నాకు నీప్సితం బగువరంబు, దయఁ బ్రసాదించి రక్షింపఁదలఁచితేని
రౌద్రమై ఘోరమై లోకరక్ష యైన, పాశుపతసంజ్ఞ మగుదివ్యబాణ మిమ్ము. 102

వ. అనినం బ్రీతచేతస్కుండై శంభుండు శాంభవీహృదయానురాగంబునను బ్రమథపరివారసమక్షంబునను మందసితంబు కందళింపఁ గరుణాకటాక్షవీక్షణంబున నప్పాండుకుమారుం జూచి త్రిపురదైతేయసుందరీవదనారవిందవాసరావసానసంధ్యాసమయసమారంభంబును గరటిదనుజకుంభకూటకూటపాకలజ్వరస్తోమంబును జలధరజలధరవ్యూహజంఝాసమీరంబును నంధకాసురప్రద్యోతనప్రభామండలంబును శార్దూలదానవారణ్యహవ్యవాహంబును నగునమ్మహనీయదివ్యాస్త్రంబు ససంప్రయోగంబు సోపసంహారంబు సకీలకంబు సరహస్యంబుగా నుపదేశించె నపుడు సేవాసమాపన్ను లగుకిన్నరకింపురుషగరుడగంధర్వవిద్యాధరులు తమతమదివ్యాయుధంబు లిచ్చిరి పార్వతీదేవి యక్షయబాణతూణీరంబు లొసఁగె దండధరుండు దండంబును బాకపాణి పాశంబును నింద్రుడు వజ్రంబును సమర్పించి రిట్లు వరప్రదానంబు సేసి యీశానుండు సపరివారుండు సాంబుండు నై యంతర్ధానంబు చేసె ననంతరంబ. 103

తే. పరమసంతోషమును బొంది బలవిరోధి, పుత్రుఁ గౌఁగిటఁ జేర్చి యాపోనికూర్మి
సమదాశ్రుకణంబులు సుప్రఫుల్ల, చక్షురంభోజదళసహస్రమునఁ బొడమ. 104

వ. ఇ ట్లనియె. 105

ఉ. భాగ్యము గాదె యశ్రమమ పన్నగకంకణుచేఁ దపఃక్రియా
యోగ్యతఁ జేసి విశ్వభువనోపకృతిప్రతిపాదనైకసౌ
భాగ్యధురంధరం బయినపాశుపతాస్త్రము గాంచి తింక వై
రాగ్యము పుట్టుఁ గాక కురురాజుపయి న్నిజరాజ్యలక్ష్మికిన్. 106

వ. నీవు నారాయణసఖుడ వైనయాదిమునీశ్వరుండవు. నరనారాయణులవలనఁ ద్రివిష్టపంబునకుఁ బెక్కుతోయములు రాక్షసబాధలు శాంతిం బొందె. నిప్పుడు హిరణ్యపురనివాసులు నివాతకవచకాలకేయాదు లగుదైతేయులు రాజ్యలుబ్ధులై నాకంబున కనేకప్ర కారంబుల నుపద్రవం బాపాదించుచున్నవారు. వారిం బరిమార్ప నమరావతీపురంబునఁ గొన్నిదినంబులు వ్రతోపవాసప్రయాసభేదం బపనయించి మధ్యమలోకంబునకుం గ్రమ్మఱ నేతెంచునది. మాతలిసారథికం బగురథంబు పుత్తెంచెద నిచ్చోటన యుండునది యని తత్కాలసన్నిహితుం డైనరోమహర్లుం డను మునిం