పుట:హంసవింశతి.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తే. చండదోర్దండమండితమండలాగ్ర
ఖండితోద్దండరిపుకాండభండనమునఁ
బండితుండగు రాజవేదండమునకుఁ
గాక, యొకపాటివాని కాకన్నె తగునె? 63

ఉ. సౌరభ మొందు కాంచనపు జంత్రపుఁబుత్రిక వాగ్విలాసము
ల్వారక నేర్చు రత్నపుసలాక తిరంబగు రూపుఁ జెందు తొ
త్కారమెఱుంగు జీవకళఁ గాంచిన చిత్తరుబొమ్మ యానశృం
గారిణియౌ సుధాసరసిఁగా నుతి సేయఁగవచ్చు నెచ్చెలిన్. 64

క. అని సిద్ధురాలు సెప్పినఁ
బొనపొనగా భ్రమలు చెందఁ బులకలు వొడమెన్
మనసిజ శిఖి యెనసినచోఁ
గనఁబడు ధూమాంకురములగతి నృపుమేనన్. 65

క. అంతట సిద్ధాంగన యా
ద్యంతంబును జెప్పి తన మహాశ్రమ మహికిన్
సంతోషంబునఁ జనె భూ
కాంతుఁడు హేమవతిమీఁది కాంక్ష జనింపన్. 66

మ. కరుణాదృష్టులు నాగవాసముల సోఁకంజూచి వేడ్క న్మనో
హరముల్ కోకలు రూకలున్ మణులు హారాలంకృతిస్తోమముల్
సరసత్వంబున నిచ్చి పంచి కొలువున్ జాలించి తాఁబోయె భూ
ప రతీశుండు మనంబు హేమవతిపై బాళిన్ దువాళింపఁగన్. 67

క. మిన్నందు సౌధవీథి స
మున్నతమగు మేలుమచ్చు లొప్పెడుచోటన్
మిన్నగు చిత్తరువులచేఁ
బన్నుగఁదగు నొక రహస్యభవనము పజ్జన్. 68

చ. అకలుషదివ్యరత్నమయమౌ నొకకేళిగృహంబులోపలం
జికిలి కిరీటిపచ్చల రచించిన చిల్కలకోళ్ళ నందమౌ