పుట:హంసవింశతి.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

హంసవింశతి


బ్రహ్మస్తుతి

ఉ.

మేరునగప్రపాతమున మించి, రహించు కనన్మణిప్రభాం
కూరకదంబకం బనఁగఁ గుంకుమగంధరసంబు భారతీ
క్రూరకుచద్వయీనిహతి గొప్పయురంబున డంబుఁ జూపఁ బొ
ల్పారు సరోజపీఠిఁ గొలువయ్యెడు దేవుఁడు మమ్ముఁ బ్రోవుతన్.

4

సరస్వతీస్తుతి

తే.

వాణి నజురాణి ఘననీలవేణి మధుర
వాణిఁ బల్లవసంకాశపాణిఁ బృథుల
సైకతశ్రోణి నాత్మలో సన్నుతింతు
సుమధుమధురసుధవచస్స్ఫూర్తికొఱకు.

5

వినాయకస్తుతి

శా.

లీలాకేళి కృతస్వకందుకములై లెక్కింపఁగా రాని యు
ద్వేలాత్మశ్రవణద్వయప్రచలనావిర్భూతవాతోత్థగో
త్రాళు ల్భూమినభోఽ౦తరాళమున నృత్యంబాడ నర్తించు గౌ
రీలీలావతిపట్టి మత్కృతికి నిర్విఘ్నత్వ మిచ్చున్ గృపన్.

6

ఆంజనేయస్తుతి

ఉ.

తావకపాదపద్మముల తాడన మొక్కటి దక్క నేపనుల్
గావు మదీయపాణులకుఁ గావునఁ జూడుము వీనినంచు సీ
తావిభుమ్రోల నిల్చి, ప్రమదంబునఁ జూపెడురీతి మోడ్పుకేల్
పావనభక్తిఁ బూనెడు కృపావని పానని నెంతు నామదిన్.

7

గరుడస్తుతి

చ.

తన తనుకాంతిఁ గాంచనకృతంబుల రీతి రహించు మారుతా
శనపరభూషణౌఘముల సారెఁ గనుంగొని చేయిసాఁచి కై
కొనఁ బటుపూత్కృతుల్ నిగుడ ఘోరఫణావళు లెత్త భీతి చా
లనము వహించు నైజసతులన్ గని నవ్వు సుపర్ణుఁ వేఁడెదన్.

8