పుట:హంసవింశతి.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

vii


జింతకాయలు రాలునా? రాలవు. కనుకనే, చక్కగా ముస్తాబై యెప్పుడెప్పుడని త్రొక్కులాడుచు, రాజరతి సుఖ మపేక్షించు రమణిమనస్సు ఏ లోకమున విహరించుచుండెనో కనుగొన్న హంస ఆ లోకమునకు వాకిలి తీసెను. ఆమె మనస్సు కుక్కవలెఁ గథలోనికిఁ దూఱెను. కథ ముగిసెను. మబ్బు విరిసెను. తిరిగి మఱునాఁడు హేమావతి పయనమగుట, హంస అదే మంత్రము ప్రయోగించుట, తూర్పు తెల్లనగుట ఇదే ప్రవృత్తి. ఇరువది రాత్రులు గడచెను. ఇరువది యెకటవ దినమున మగఁ డింటికి వచ్చెను. కథ కంచికిఁ బోయెను. కంచి-కాంచి. కాంచి స్త్రీ మొలనూలు. కథ అక్కడకుఁ బోయెను. సతియుఁ బతియుఁ గలిసి సుఖించుట ప్రధాన కథా పర్యవసానము.

కావ్యాంతమున - ఇన్ని కథలు విన్న యా యన్నుమిన్న “పరపురుషసంగమం బిహపర సుఖ దూరంబు" అన్నది. అనఁగా ఆమెకు బుద్ది వచ్చినదని యర్థము. ఆమెను గోరిన రాజుకో ? అతనికిని బుద్ది వచ్చినది. నోరు దెఱచి "ఉర్విజనావళు లన్యకాంతలన్ బన్నుగఁ గోరరాదు, కడుఁ జాతకము" అన్నాడు. కనుక ఈ కథలు వట్టి కథలు కావు.

ఇంత ప్రయోజనకారియైన యీ గ్రంథము క్రీ.శ. 1911 నుండి 1947 వఱకు ముప్పది యాఱేండ్లు అజ్ఞాతవాసమేల చేసినది? ఇది ప్రశ్న. "ఇంటివాఁడే పెట్టె కంటిలో పుల్ల" అను సామిత యంద ఱెఱిఁగినదే. కొందఱు ప్రబుద్ధులు ఆసభ్యసాహిత్యమని ఆంగ్ల ప్రభువులకుఁ జెప్పి కొన్ని గ్రంథములు నిషేధింపఁజేసిరి. నారాయణామాత్యుఁడేకాదు, శ్రీనాథుఁడును దోషియయ్యెను. ఈ లెక్కను జూచినచోఁ గాళిదాస మహాకవి ప్రథమదోషి కావలసివచ్చును. దశమస్కంధముఁ దీసికొన్నచో బమ్మెర పోతన్నకూడఁ దప్పించుకొనలేఁడు. లక్షోపలక్షల తెలుఁగు రసజ్ఞులను ముద్దాయి (ముత్ + దాయి = సంతోషదాయి) యగు హంసవింశతి ముద్దాయి (దోషి) యయ్యెను. అయిన నేమి ! అశేషప్రజ యెన్ని వ్రాఁతప్రతులు కల్పించుకొనెనో, యెంత శ్రమపడెనో, “ఆంధ్ర కేసరికిఁ” దెలియును. 1947 సం|| న రాహుపీడ తొలఁగి, హంసవింశతికి స్వతంత్ర ప్రకాశము కలిగెను. ఈనాడీగ్రంథ మింత తప్పుల తడకగా మిగులుటకు హేతువు తత్తమోగ్రహ మీ గ్రంథమును మ్రింగి యుమియుటయే.