పుట:హంసవింశతి.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lvii


శ్శంక కేఁగెను. శఠుఁడు కికురించి యింటికిఁబోయి, దూలము మీఁది యట్టుకఁ జేరి దాఁగియుండెను. తెల్లవాఱెను. సుఖమతి మహోల్లాసముతో నొకజోస్యుని లంకించుకొని యింటికిఁ దెచ్చెను. కలియఁబోవు నదనునఁ బతి యునికి గనిపెట్టెను. కనిపెట్టి ప్లేటు త్రిప్పెను. "అయ్యా! జోస్యుఁడా! నాపతి చాల శ్రమపడుచున్నాఁడు. పోయినపని అగునా? కాదా? ఎప్పుడింటికి వచ్చును?" అని వక్కాకిడి ప్రశ్నించెను. సైగ తెలిసికొన్న జోస్యుఁడు- “నీ భర్త నేఁడే వచ్చును. చూడు నా మాట" అని వెడలిపోయెను. శఠుఁ డప్పుడే అటుక దిగి, “సెబాసు! నీ పాతివ్రత్య " మని శ్లాఘించి, సుఖమతినిఁ గౌఁగిలించుకొనెను.

పదునాల్గవ రాత్రి కథ.

హిరణ్యగుప్తుని భార్య హస్తిని. ఆమెను జూచి సుంకరి కొల్వుకాఁడొకఁడు మోహించెను. మోహినీ శక్తిని బ్రయోగించి వశపఱచుకొనెను. ఇరువురకుఁ జనవు బలిసెను. వారు క్రీడించుచుండఁగా నొకనాఁడు గృహస్థుఁడు వచ్చి తలుపు దీయు మనెను. హస్తిని విటునకు ముసుఁగుబెట్టి యరుగు మీఁదం బరుండఁబెట్టి వాకిలిఁదీసి "తడవాయెను సుంకరీఁడు తమ లెక్కలకై పడియున్నాఁ డిదె" యని హీన స్వరముతోఁ జెప్పి చూపించెను. సెట్టి చప్పుడు గాకుండ వైదొలఁగి పొరుగింటఁ దల దాఁచుకొనెను. తరువాత విటుని సంతుష్టుని జేసి పంపించి, పతిని బిల్చెను. పతి వచ్చి సతిచర్య నభినందించెను.

పదునైదవ రాత్రి కథ.

సత్యకేశిని రెడ్డిసాని. ఒక బంట్రౌతును మరగి యుండెను. ఒకనాఁడు రత్నగుప్తుఁడను సెట్టిని లోఁగొని, రమించుచుండఁగా బంట్రౌతు వచ్చి తలుపు దట్టెను. సెట్టిని గాదెలో దాఁచి, తలుపు దీసి బంట్రౌతుతో రమించుచుండఁగా, రెడ్డి వచ్చెను. రెడ్డిసాని తలుపు దెఱచి, పగ చాటుచు వదరుకొనుచుఁ బొమ్మని బంట్రౌతును బంపెను. వాఁడు తిట్టుకొనుచుఁ బోయెను. “ఏమి వాఁ డెందుకు వచ్చినాఁడు? వదరుకొనుచుఁ బోవుచున్నాఁడే!" అని రెడ్డి గద్దించి యడిగెను. రెడ్డిసాని నవ్వుచు గాదెను జూపి, “ఈ సెట్టిగానిఁ దఱుముకొనుచు వచ్చెను.