పుట:హంసవింశతి.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v


కెక్కడిది. వారిరువురు సమకాలికులు కారు. దాదాపు ఒక శతాబ్ది కాల మతనికి నితనికి నెడ ముండి యుండును.

వావిళ్ల ప్రతులు అందాజుగా నారాయణకవి క్రీ. శ. 1800 ప్రాంతము వాఁడని ప్రకటించినవి.

అయ్యలరాజువారి వంశవృక్షమున్నది కదా! అది 15 వ శతాబ్ది నుండి లెక్కింపఁబడినది. 16 వ శతాబ్దమున రామభద్ర కవి యున్నాఁడు. 18వ శతాబ్దమున “రెట్టమత శాస్త్ర" కవులున్నారు. వీరొక మంచిపని చేసిరి. తమ గ్రంథము శా|| శ|| 1692 సం॥న రచింపఁబడినట్లు గ్రంథాంతమున సీస పద్వమునఁ దామే వ్రాసికొనిరి. అది క్రీ.శ. 1770. ఆ జంట కవులలో నొకఁడగు భాస్కరకవి మనుమఁడే మన నారాయణకవి. కనుక నారాయణకవి క్రీ. శ. 1750 సం||నకు ముందుండుటకు వీలు లేదు.

బ్రౌన్ దొర క్రీ.శ. 1820 స|| న కడపలోఁ గాఁపుర ముండెను. హంస వింశతి పలుకుబళ్లు అప్పటికే కొన్ని ప్రచారమున లేవు, తమ నిఘంటువులోఁ గొన్నిఁటికి “అర్థము తెలియలేదు" అని వ్రాసిరి. పలువురు పండితులకు జాబులు వ్రాసి పద్యార్థము గ్రహించుటకు శ్రమపడిరి. కనుక 1820 ప్రాంతమున నారాయణకవి లేఁడనుట స్పష్టము. సరికదా, అతని పలుకుబళ్లు అర్థము కాకపోవు స్థితి కొంత కలుగుటకు అర్ధ శతాబ్ది కాలమైనను అప్పటికి జరగి యుండవలెను. కాఁగా నారాయణకవి క్రీ.శ. 1770-75 ప్రాంతముననుండి యుండునని యూహింప వచ్చును.

కథా సాహిత్యము

హంస వింశతి తెనుఁగున నొక స్వతంత్ర కథా ప్రబంధము. ప్రాచీన సంస్కృత ప్రాకృత కథలకు అనువాదము కాదు : అనుకరణమును గాదు: అచ్చముగా జీవకళ యుట్టిపడు తెలుఁగుజాతి లోఁగిళ్ల కథాకదంబము. ఈ జాతికిఁ జెందిన కథా ప్రబంధములలో "శుకసప్తతి" మొదటిది; "హంస వింశతి" చివరిది.