పుట:హంసవింశతి.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iii


యుండెనని, ఆ ప్రాంతమునఁ జెప్పుకొనుచున్నా రని వ్రాసిరి. ఆ పొత్తపి యొంటిమిట్ట చేరువ నున్నది.

నగర గ్రామ నామముల పట్టికలోఁ గడప మండలము నందలి చిన్నచిన్న యూళ్ళ పేర్లుగూడ వ్రాసెను గనుక ఈకవి “కడపమండల వాసియే యని నిర్ధారణము సేయ నవకాశము కలుగునే కాని వేఱొక యూహ కవకాశము కల్గదు” అని శ్రీ శర్మగా రుద్ఘాటించిరి. “పుష్పగిరి తిరునాళ్ళను గూడఁ బేర్కొనుటయుఁగూడ నా పై యుద్దేశమును బలపఱచు చున్న" దనిరి.

అంతేకాదు, అయిదవ రాత్రి కథలో గొల్ల దంపతులు పిల్లలు లేక పుష్పగిరి తీర్థము కొంగుముళ్ళతో సేవింతురు. ఈ పుష్పగిరి కడపది. గొడ్రాండ్రు సంతానాపేక్షతోఁ బుష్పగిరి గుట్ట తిరుగుట నేఁటికిని గద్దు.

నదుల పట్టికలో బాహుద, కుముద్వతి కలపు, అదే పట్టికలోఁ బునరుక్తి గాఁ జెయ్యేఱు, కుందు చేర్పఁబడినవి. ఇవి కడప మండలమునఁ బాఱు పను నదులు, అభిమానముతో ఆమ్రేడించినాఁడు.

వాస్తవస్థితి యిట్లుండఁగా నీకవి “నఖగర్త పురాంజనేయ నతజన గేయా” యను మకుటముతో నొక శతకము రచించె నని, నఖగర్త పురము "గోరుగుంతల పాడు" అని, అది నెల్లూరు జిల్లాలో నున్నదని, కనుక ఇతని యునికి గోరుగుంతలపాడేమో యని కొంద ఱూహించుట జరిగినది. ఆంజనేయ శతక ప్రస్తావము గ్రంథమున లేదు. లోకమున ఆ శతక మగుపించుట లేదు. తోఁకను జూచి ఆంజనేయు నూహించుకొనుటయే. శతకము హుళక్కియని త్రోసివేయ నక్కఱ లేదు. ఉండిన నుండుఁగాక. నారాయణకవి రామ మంత్ర సిద్ధి పొందినవాఁడు. ఇతని ప్రసిద్ధి విన్న గోరుగుంతలపాటి వారు ఇతని యింటికి వచ్చి యర్థించి, ఆంజనేయ శతకము వ్రాయించుకొని పోయినారేమో ! ఇప్పుడు సుప్రభాతములు వ్రాయించుకొన్నట్లు, లేకున్న అనాఁడు నఖగర్తపురమే ఒంటిమిట్ట దగ్గర నుండె నేమో ! అదియుఁ గాకున్న “పురం పురి శరీరేచ". (విశ్వకోశము) అన్నారు గనుక నతజన గేయుఁడైన నఖగర్త పురాంజనేయుఁడు రిపు నఖక్షత చిహ్నిత గాత్రుఁడై న రణధీరుఁడైన కపివీరుఁ డేమో !