పుట:హంసవింశతి.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240 హంస వింశతి



క. ఆ సమయంబున నెటువలె
భాసురమతి బొంకవలయుఁ బలుకంగఁగదే!
యో సుదతీ! యని యడిగిన
నాసఖి యిది తెలియదనుచు నటుమొగ మయినన్. 232

తే. హంస హేమావతికి నిట్టులనియె వేడ్కఁ
దెలియకుండిన నేమాయెఁ దెలిసికొనుము
వింటివా? పతి ఘర్షింప విటుఁడు వడఁక
వెఱవకు మటంచుఁ జెలి వాని వెన్నుఁజఱచి. 233

ఉ. కీలెలుఁగున్ ఘటించి పరికింపక పండుక యుండి పల్కె “యా
త్రాలసదుర్విచారులము రాత్రి జనించిన నేఁడు తావకీ
నాలయమందు మేమిదె సుఖాప్తిని సుప్తియొనర్చి రేపుషః
కాలమునందుఁ బోయెదము కారుణికోత్తమ! పండనీయవే!" 234

తే. అనిన “మంచిది” యని లోని కరిగె నాథుఁ
డరిగినది చూచి సఖి లేచి యంతలోనఁ
బంటితో నీళ్లు పట్టుక యింటిలోకిఁ
బోయి “యేడుంటి వీసరి ప్రొద్దు దనుక? 235

క. ఒక్కతెనె గ్రుక్కు మిక్కని
దిక్కెడసిన రీతినుండి తెరువరు లేవరో
యిక్కడకుఁ బండ వచ్చిన
నక్కట! ప్రాణమ్ములుండె నధిపా!” యనినన్. 236

ఆ. నిండినింటిలోన నీకేల భీతిల్ల
గోల! యూరఁ బొద్దు గ్రుంకలే ద
టంచుఁ గౌఁగిలించి యనుమాన మొందక
యోర్చుతో సుఖాప్తి నుండెఁ జెలియ! 237