పుట:హంసవింశతి.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 221



కలయిక మాటలఁ గరఁగించు చెలువంబు
లాస పుట్టఁగ నవ్వునట్టి నేర్పు
తేలించి చేతులు ద్రిప్పెడు పొంకంబు
హర్షించి తాను చుక్కనెడు సొబగు
చిన్నెల పసఁజూపి సన్నఁ జేసెడి తీరు
ముక్కుపై వ్రేలిడి చొక్కు వగలు
తే. వలుఁద గుబ్బలఁ బయ్యెద వైచు ఠీవి
నఱకు మెట్టెలు రొదలిన నడుచు సొగసు
విను త్రిలోకము లందుండు వెలఁదు లందుఁ
గానఁబడ దెన్నటికి నైనఁ గమలగంధి! 199

తే. అదియుఁ గ్రొవ్వున వీఁడువాఁడనక చొచ్చి
టెక్కు గలవాని చూపు సొంపెక్కువాని
బలము గలవాని రతులఁ బేర్వడిన వానిఁ
గనిన విడువదు వానితోఁ గలిసి కాని. 200

వ. ఇట్లు ప్రతిదినప్రవర్ధమానానూనమోహాతిరేకంబున నన్యమానవవితానమీనకేతనాయోధనాధీనమానసాంభోజయై యయ్యంభోజనయన విజృంభించి మెలంగుచున్న యవసరంబున. 201

చ. ఒకఁడు కిరాతదేశమున నుండెడు కోమటి పోలిసెట్టి పు
త్రకుఁడు హిరణ్యనామకుఁడు తండ్రి యదల్చిన నల్కతో సఖి
ప్రకరము గొల్వఁగా సుకృతపాటవ మొప్ప మహానదుల్ నిధుల్
సకలముఁ జూడఁగోరి చనె సత్వరయానమునన్ ముదంబునన్. 202

వ. ఇట్లు చని చని. 203