పుట:హంసవింశతి.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192 హంస వింశతి

క. ఘన జఘన స్తన యుగములు
వెనుకను దలమ్రోల నుద్దవిడి నొత్తంగా
మన లేక యారు మఱుఁగునఁ
బనుపడ దాఁగెననఁ గౌను భామకుఁ దనరున్. 75

సీ. విష్ణుపదం బంటె వేమఱు మేఘంబు
చంద్రుండు ముట్టె నీశ్వరు శిరంబు
తీర్థంబులోఁగొని ధృతినిల్చె శంఖంబు
కోరి ప్రసాదంబుఁ గొనె ఘటములు
దండనుండిన సాధుతరులఁ దాఁకెను లత
లతనుధర్మముల తోడనియె విరులు
పుణ్యనదీనదంబుల నిల్చెఁ బులినమ్ము
లల పితామహునాజ్ఞ నలరె నంచ
తే. కుంతలానన కంధర కుచ సుబాహు
నఖ కటి యాన పటు శోభనత వహించి
దీటు రాలేమటంచును దృఢ మనీషఁ
జెలియ యంగమ్ములకు బాస చేసినటుల. 76

ఆ. మొగము నిండియుండు మోహంపుఁ గన్గవ
యురము నిండియుండు నుబ్బుచనులు
వీపు నిండియుండు వేనలి జొంపంబు
దానిఁ బొగడఁదరమె! మానవులకు. 77

క. ఆ హస్తిని యౌవన ము
త్సాహమునన్ బిడ్డ పాప సందడి లేమిన్
మోహన తర విట వృషభ
వ్యూహములకు వల్లెత్రాటి యొఱపున మెఱయున్. 78