పుట:హంసవింశతి.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 191

క. విరులా! నగవులు, నీలపు
సరులా! కురు, లుబ్బు గబ్బిచన్నులు జాళ్వా
గిరులా! యూరు లనంటుల
సిరులా! యని జనులు మెచ్చఁ జెలువ చెలంగున్. 71

క. చిందం బనఁదగు గళమును
గుందమ్ముల తీరు రదన కోరక పంక్తుల్
మందమ్ములు గమనమ్ములు
చెందమ్ములు పొగడఁ దరమె? చెలువపదమ్ముల్. 72

ఆ. కలువ చెలువ చెలువుఁ గైకొను కన్నులు
జగ మెఱుంగు రంగు జగమెఱుంగుఁ
గులుకుఁ దొలుకు మొలక గుబ్బల పసగల
వనిత మేలు కొక్క వనిత మేలు. 73

సీ. బలితంపుఁ బులినంపు వెలఁ బెంపు జఘనంపు
బోఁడిమెన్నఁగ నొక్కనాడు పట్టు
విరితమ్ములను గ్రమ్ము సిరిఁజిమ్ము వదనమ్ము
చెలువమెంచుట కొక్క నెలయుఁ బట్టు
నిరు లెప్పుడును గుప్పు నెఱకప్పుగల కొప్పు
ప్రణుతింప నొక్క యబ్దంబు పట్టు
జిత జంభకరికుంభ తతడింభ కుచకుంభ
యుగమెన్నుటకు నొక్కయుగము పట్టు
తే. చొక్కటపు రిక్కగమి నిక్కు టెక్కు జక్కు
నఖముల నుతింపఁ గల్పకాంతంబు పట్టుఁ
గెంజిగురు సంజ కెంజాయ పుంజిఁ దెగడు
పదము లెన్నంగ బ్రహ్మకల్పంబు పట్టు. 74