పుట:హంసవింశతి.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190 హంస వింశతి

క. కని రాజహంసవరుఁ డి
ట్లను “భళి! మేల్జాణ వౌదువౌ సొగ సమరెన్
జననాథు నెనయఁ బోయేదొ
విని పొ మ్మొక కథ” యటన్న వెలఁ దిట్లనియెన్. 68

మ. “కలహంసాధిప! నీ స్వబుద్ధి నిటులన్ గల్పించెదో! కాక పె
ద్దలచేఁ బూర్వము విన్నవాఁడవొ! మహాదైవ ప్రసాదంబొ! విం
తలు సుమ్మట్లు వచింప నన్యులకు, మేధాశక్తి నిన్ బోలు వా
రలు లేరింక, బలారె; చెప్పు” మనుచున్ రాజాస్య ప్రార్థించినన్. 67

పదునాల్గవ రాత్రి కథ

కోమటిబోటి సుంకరి కొల్వుకానిఁ గూడుట

క. ఆ మానసౌక మభినవ
తామరస మరంద బిందు తత బృందంబుల్
నేమించి కురియు వాక్కుల
హేమావతి కనియె మోద మిగురొత్తంగన్. 68

చ. వినుము విదర్భ దేశమున విశ్రుతమై సిరులందు విహ్వలం
బన నొక పట్టణం బమరు, నచ్చట నొండొక వైశ్యుఁ డెంతయున్
దనరు హిరణ్యగుప్తుఁ డను నామముతోడఁ దదీయ భార్య హ
స్తిని యను పేరునన్ బరఁగుఁ జెప్ప నశక్యము దాని వైఖరుల్. 69

క. మిల మిల మను మెయి తళుకులు
పొల యలరుల వలపు గులుకు పొలుపగు నగవుల్
చిలుకల కదుపుల నదలుచు
చెలి సొలపుల పలుకు లలరుఁ జిలుకలకొలికీ! 70