పుట:హంసవింశతి.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 189

క. "ప్రమదా: నీ పాతివ్ర
త్యము భక్తియుఁ గంటి సందియము లేదిఁక" నం
చు మనోరాగంబున శఠుఁ
డమిత స్తుతు లొనరఁ జేయ, నది యిట్లనియెన్. 62

తే. “కాంత! నే నెన్నుకోరాదు గాని నన్నుఁ
బోలఁగల సాధ్వు లున్నారె? పుడమిలోన"
ననుచుఁ బతితోడఁ జెలరేఁగి యాడుకొనఁగ
నిండుమోదంబున సుఖాన నుండె నతఁడు. 63

చ. అని కలహంస చెప్పిన నయారె! కథాస్థితి యంచు మెచ్చుకొం
చును దపనోదయ ప్రభలు సుందరి కన్గొని యింటిలోనికిం
జని పవ లెల్లఁ బోఁగడపి సారసమిత్రుఁడు పశ్చిమాద్రికిం
జనిన యనంతరంబ మనుజప్రభుపై విరహంబు మీఱినన్. 64

సీ. కళదేరు కస్తూరి తిలకంబు వాసనల్
లపన గంధములకు లంచ మొసఁగ
నవరత్న తాటంక వివిధ కాంతిచ్ఛటల్
నునుఁ జెక్కు జిగికిఁ గానుక నొసంగ
నలరు మానికపు సోయగపు దండల టెక్కు
కనకాంగ దీప్తికిఁ గట్న మిడఁగఁ
జెంగావి వలిపంపుఁ జీరంచు సరిగడాల్
పదశోణ ఘృణులకుఁ బగిడిఁ బెట్ట
తే. మదన మదహస్తి విడిపడ్డ మాడ్కిఁ బడఁతి
పుడమియొడయని కడ కేఁగ బెడఁగు నడల
నడచు వడిఁ గడుఁ గ్రొమ్ముడి సడలి విరుల
జడి పొడమ నిల్లు వెలువడి చనఁగ నపుడు. 65