పుట:హంసవింశతి.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184 హంస వింశతి



చ. దుసికిలఁబాఱు చీఁకటులు దూఁకొనుచుండెడు గీలుగంటుపైఁ
బసగల పూలు నిగ్గుగల ఫాలతలంబునఁ జాదుబొట్టు దృ
గ్వసతికి గజ్జలంబు నరకాలున నంచులు జీఱు చీర, తా
రసమగు పుష్కకంచుకము రంజిలఁగాఁ జరియించు వీథులన్. 40

తే. ఇటుల జరియింపఁగా దాని యెమ్మె లెఱిఁగి
వట్టి యనుమానమలచేత బెట్టు గుంది
కని విరూపిణిగాఁ జేసి కాంత వీడి
చనియెద నటంచు నెమ్మది శఠుఁడు దలఁచి. 41

క. ఒకనాఁటి రాత్రి యింటను
సకియ కడన్ బవ్వళించి సంభ్రమమునఁ బౌం
డ్రక దేశమునకుఁ జనియెద
నొక పనికని వేగ యామముండెడు వేళన్. 42

తే. పయనమై లేచిపోవుచో భార్యతోడఁ
జెప్ప నొక్కింతదూర మచ్చిగురుఁబోఁడి
సాఁగ నంపి బహిశ్శంక కేఁగ, నతఁడు
దిరిగి కికురించి వేగ మందిరము చొచ్చి. 43

ఉ. దూలముమీఁది యట్టుకను దొంగవిధంబున నిశ్చలాంగుఁడై
తాలిమిఁ జిక్కఁబట్టి కులతామరసేక్షణ చర్యలెల్ల నా
మూలముగాఁ గనుంగొనెడు బుద్ధిని నాశఠుడుండు నంతఁ బ్రా
క్శైలశిఖాగ్రభాగమున సారసమిత్రుఁడు తోఁచె నంతటన్. 44

క. పనిపాటుఁ దీర్చి సుఖమతి
పనివడ నేఁడింటితొడుసు బాసెగదా యం
చును వెల్వడిచని వీథిని
మనసిజ వేదనల జాలిమాలి తిరుగఁగాన్. 45