పుట:హంసవింశతి.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xix


పోఁదలఁచినాఁడు. రౌర్థన్యము వలన లగ్గు కలుగదు. ఎగ్గు కలుగునని తెలిసికొన్నాఁడు. "ఉర్విజనావళు లన్యకాంతలన్ బన్నుగఁగోరరాదు, కడుఁ బాతక మంచుఁ దలఁచి"నాఁడు. పాతకమన్న నిశ్చయమెపుడు కలిగెనో అపుడే “యింతిపై నున్న మనంబు ద్రెక్కొని" యధోచిత పధ్ధతి నుండె". (5–374)

ఇక్కడ మనోలక్షణము చెప్పఁబడెను. ఱేనియెదలో జోగురాలు ముట్టించిన యగ్గి, హేమవతి చెవి యొగ్గినదన్న కుంటెనకత్తెమాటతో ధగ్గుమని ప్రజ్వరిల్లి హేమవతి పతిసక్తయయ్యెనన్న మాటతో బుగ్గియై చల్లబడెను.

“మన ఏవ మనుష్యాణాం
 కారణం బంధ మోక్షయోః "

శుకసప్తతికి హంసవింశతికి పోటీ

శుకసప్తతి కృతికర్త కదిరీపతి. చంద్రవంశ క్షత్రియుఁడు. ప్రభువు. "సర్వజ్ఞమౌళి! కంజకరరూప! కదురభూప!" అని విద్యజ్జనములచేఁ గీర్తింపఁబడ్డవాఁడు. కృతి శ్రీరామాంకితము చేసిన ధన్యుఁడు.

హంసవింశతికర్త నారాయణకవి. "అమాత్య దేవేంద్రుండు." "అంబురుడ్భవ కభుగ్ధవ విధూద్భవ మరుద్ధవగురు ప్రతివిఘాతి" మేధాశక్తిగలవాఁడు. కృతి శ్రీరామాంకితము చేసినవాఁడు, కులముచేత, ఇంద్రపదముచేత, మేధచేత, రూపముచేత, అధికుఁడనని వ్రాసికొన్న ధీరుఁడు.

కదిరీపతి ధౌమ్యుఁడను పురోహితునిచే ధర్మజునకుఁ గథలు చెప్పించెను. మూలకథ పార్వతికిఁ బరమేశ్వరుఁడు చెప్పెను.

నారాయణకవి ప్రత్యుత్పన్నమతియను పురోహితునిచే నలునకుఁ జెప్పించెను. మూలకథ పార్వతికిఁ బరమేశ్వరుఁడు చెప్పినదే. ధర్మజునకంటె నలుఁడు పూర్వుఁడు. అధికుఁడు.