పుట:హంసవింశతి.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఆధునిక ప్రబంధములలో హంసవింశతి యొక అపూర్వ ప్రబంధము.

హంస వింశతి అలనాఁటి జనసామాన్యము యొక్క స్థితిగతులకు అద్దము. తెలుఁగు పలుకుబళ్ళకుఁ బుట్ట. బహువిషయ విజ్ఞాన సంపత్తికిఁ గాణాచి. చవులూరించు చిన్న చిన్న కథలతో ముద్దులొలుకు మంచి మంచి పద్యములతో రసికజనమును వశీకరించుకొన్న రమణీయప్రబంధము.

ఈప్రబంధమునందలి దేశీయమైన పలుకుబడి విలువ గుర్తించిన భాషాసేవకులలో బ్రౌన్ దొర ప్రథముఁడు. బ్రౌణ్య నిఘంటువున నెక్కడఁ జూచిన నక్కడ హంస వింశతి పదములు పద్యములు కానవచ్చును.

హంసవింశతి అక్షయ ప్రజాసాహిత్య నిక్షేపము.

కవి

అయ్యలరాజు నారాయణామాత్యుఁడు. కౌండిన్యస గోత్రుఁడు. కొండమాంబా సూరయార్యుల పుత్రుఁడు.

"మంత్రి మాత్రుండె? దుర్మంత్రి మంత్ర తంత్ర సంత్రాసకరణ స్వతంత్రుఁడు" (1-15)

"వెండియు నఖండ తేజఃకాండ మార్తాండ మండల ప్రచండుండు"

"నిజ వితరణ........వ్యూహుండు, నారాయణామాత్య దేవేంద్రుండు" (1-16)

ఇతఁడు ప్రభువు కాఁడు. తేజశ్శాలియైన మంత్రియా? తన ప్రభువు పేరు చెప్పలేదు. కనుక మంత్రియుఁగాఁడు. నియోగి బ్రాహ్మణ కుటుంబి.