పుట:హంసవింశతి.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90 హంస వింశతి

తే. నక్షతలచిప్ప సాన చిత్రాసనమును
గిండి చిటిచాప పళ్లెంబు గిన్నె పెట్టె
కుశసమిత్పత్రములు పెట్టు గొప్పయటుక
యమరఁ గాఁపురముండు నయ్యగ్రజుండు. 137

చ. అతనికి హేమచిత్ర యను నంగన ద్రుంగినవెన్కఁ జారుభా
స్వతియను ముద్దుగుమ్మను వివాహ మొనర్చిన నింతియొప్పె న
య్యతనుని చేతికత్తి చివుకంతయుఁ బోయినఁ జేవఁజిక్కు స
మ్మతి నెలజవ్వనంబు పొడమన్ జిగిదేఱెడు దేహసంపదన్. 138

క. ఆ పటుకుచముల చందం
బా పెద్ద పిఱుందుమంద మా మోమందం
బా పొంకం బా బింకం
బా పంకజముఖికె కాక యన్యకుఁ గలదే. 139

ఉ. ఆ మధురోష్ఠి గుబ్బకవ నబ్బిన సిబ్బెపుఁదళ్కు లందమా
యా మృదులోరు కన్నుఁగవ నన్నువ వెన్నెలలొల్కు చందమా
యా మితమధ్య సోముకళ లానినమోము మెఱుంగు లందమా
యేమని చెప్పవచ్చు నళినేక్షణ! యా చెలిరూపసంపదల్. 140

తే. వక్రయానంబుతో నాగ చక్రకుచలు
నిలువుఁగన్నులతో దేవ నీలకచలు
నాతి మృదుగతి చపలేక్షణముల కలికి
క్రిందుమీఁ దైరి కాదె పూర్ణేందువదన! 141

సీ. నెఱిగొప్పు మేఘసందేశంబు కనుదోయి
యందమౌ కువలయానంద మరయఁ
బొంకపుమోము ప్రబోధచంద్రోదయం
బధరంబు మణిసార మౌర! చూడఁ