పుట:హంసవింశతి.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75 హంసవింశతి



చ. కుఱుబవి దోరచాఱ నలగొండ్లెఱగొండిలి మూజ బొల్లివిన్
నఱిగివి నెట్టుజోడు పులనల్లని వెఱ్ఱవి పుల్ల చిల్లవిన్
బఱిగివి మొఱ్ఱివిన్ గరకపల్లవి నాఁదగుపేళ్ల నొప్పెడున్
గొఱియలు వేనవేలుఁగలగుంపు లసంఖ్యము లుండు వానికిన్. 76

తే. బోడి పొడమట్టి నామంబు బొల్లిపూరి
జాలవల ఫుల్ల వెఱిబట్ట చాఱ బఱిగి
కఱుకుగడ్డము తెలమొఱ్ఱి గవర దోర
వనెడు పేరుల మేఁకగుం పతని కుండు. 77

తే. మట్టె చేమట్టె కఱె పస్సె మైల బట్ట
కోర తలపూజ వెఱ్ఱనిచాఱ బోడ
పొడ కపిలకన్నె బొలిచుక్క పుల్లవి యను
పేళ్ల నొప్పారి మందకోఁ బెక్కు గలవు. 78

క. పల్లవి నల్లవి యెనుములు
బిల్లలనిడు గోడిగలును బెంపుడు పెద పొ
ట్టేళ్లును దుక్కెడ్లును విల
సిల్లగ నా విజయుఁ డచట సిస్తుగ నుండున్. 79

క. అతనికి మంజుల యనఁగా
సతి యొక్కతె గలదు దాని సరియెన్నుటకున్
గొతుకుపడు రతికిఁ జతురత
యితరుల నిఁక నెన్న నేల యిందునిభాస్యా! 80

క. ఆ కుల్కు లా యొయారము
లా కనుఁదమ్ముల మెఱుంగు లా కౌను బెడం
గా కుచయుగ్మము బింకం
బా కోయిల ముద్దుఁబల్కు లతివకె చెల్లున్. 81