పుట:హంసవింశతి.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72 హంసవింశతి

సీ. కల సమీపపుటూళ్ళ కాఁపుగుబ్బెతల నె
మ్మదుల నాకర్షింప మంత్రవిద్య
బచ్చుఁ జాయపు వృషభవ్యూహములనెల్ల
వఱలంగ గుమిగూర్ప వల్లెత్రాడు
చిల్లరసరకుల సెట్టి బేరాల కిం
పుగ లాభమొందింపఁ బూఁటకాఁపు
పెనుకోటకాండ్రకు జనసమూహంబుల
గణితి చూపెడు నాయకప్రభుండు
తే.ముద్రగరిఁటియ భుజముపై మొనయఁబెట్టి
ఘంట ఖంగని మ్రోయ సంగళ్ళఁ బడిని
మరగి తిరుగు సళాదికి మణియకాండ్ర
కవనిఁ బడికాఁపునా వింత నలరు సంత. 48

క. అంతట నాసంతకుఁ దన
కాంతుఁడు వస్త్రమ్ము లమ్మఁగా నేఁగిన హే
మంతిని వ్యాపారి విటో
పాంతమునకు మంత్రసాని నడిపిన నదియున్. 49

తే. పోయి సమయంబుఁ దెలుప నబ్బొజుఁగు వేడ్క
వింత నెఱపూఁత గందంబు విరులు సరులు
కప్రపు విడెంబు జిగిచెల్వు గులుక సొగసుఁ
దనర హేమంతి యిలు సేరెఁ దత్క్షణమున. 50

ఉ. చేరినఁ దంతువాయసతి సిస్తుగ నిస్తుల రత్నవస్తు వి
స్తా సువర్ణవర్ణముల సంపద లింపొనరించు కేళికా
గారములోన దివ్యమగు కమ్మనితావుల హంసతూలికం
జేరిచి మేరమీఱు తమిఁ జీరగ మారుని పోరి కయ్యెడన్. 51