పుట:హంసవింశతి.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంధక రస నాభుల లక్షణంబు లెఱింగి విఱుచు ప్రావీణ్యంబును లోహభస్మ తామ్రభస్మ వంగభస్మ సీసభస్మ నాగభస్మ శంఖభస్మ సువర్ణభస్మంబులు సేయు మర్యాదయు శీతభంజి అరళ్యాది మాణిభద్ర తాళీస మాత్రలుగట్టు నవధానంబును క్షౌరద్రావక గుగ్గుళు పిష్టకషాయంబులు మూలికలు కైకర్ణికలు సేయు నౌచిత్యంబును సూత్రస్థాన శారీర నిదాన శాస్త్రంబుల పరిచితియును డెబ్బది రెండు నాడిభేదంబులును వాత పైత్య శ్లేష్మంబుల నుల్బణంబులైన త్రిశతషష్టి రోగంబులకుఁ దత్తచ్చికిత్సలు చేయు చాతుర్యంబును గలిగి రెండవ ధన్వంతరి యనంబరగు నతఁడు. 234

తే. వీథివెంటను రాఁజూచి వెలఁది యనియె
నౌర! యిట్లుండ వలదె యొయార మహహ!
వీనిఁ జిక్కించికొని మారవిగ్రహమున
భంగపడఁజేయనిది యేటి ప్రౌఢతనము. 235

క. అని తన మనమున ననుకొను
చును నిలుచున్నంత దాని సొగసు నొయారం
బును గని మనసిజ సమ్మో
హనవిద్యను జొక్కి యాతఁ డంచుకు రాఁగన్. 236

ఉ. "ఎక్కడనుండి యెక్కడికి నేమి ప్రయోజనముండి వోయె, దీ
వక్కట! నామమే?" మనిన నన్నియుఁజెప్పి "పరోపకారిరా!
యిక్కలకంఠకంఠి" యని యెంతయు డగ్గరఁజేర మారుఁడున్
బ్రక్కలు నెక్కొనన్ బొడువఁ బై కొను మోహముచేత లేమయున్. 237

తే. అమల శశికాంతకాంత శుద్ధాంతకేళి
కా నిశాంతాంతరమ్మున ఘమ్ము రనెడు
పచ్చ బచ్చెన చిత్తరు పనుల మించు
ప్రతిమ సంఘట్టనల మంటపంబులోన. 238